ఆఫ్ఘన్ జూనియర్ వాలీబాల్ క్రీడాకారిణి తల నరికిన తాలిబన్లు
న్యూ ఢిల్లీ అక్టోబర్ 20
ఆఫ్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్ల దురాగతాలు క్రమ క్రమంగా బయటపడుతున్నాయి. ఆ దేశ జాతీయ జూనియర్ వాలీబాల్ క్రీడాకారిణి మహజాబిన్ హకిమి తల నరికి ఆమెను దారుణంగా చంపినట్లు ఆ టీమ్ కోచ్ అఫ్జాలీ తెలిపారు. తాలిబన్ మిలిటెంట్లు ఈ నెలలో ఈ దారుణానికి పాల్పడ్డారని పర్షియన్ ఇండిపెండెంట్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన చెప్పారు. దీని గురించి బయటకు చెప్పవద్దని ఆమె కుటుంబాన్ని తాలిబన్లు బెదిరించారని, దీంతో ఈ విషయం బయటకు రాలేదని అన్నారు.ఆగస్ట్‌లో కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత జాతీయ వాలీబాల్ టీమ్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు మాత్రమే దేశం విడిచి వెళ్లగలిగారని అఫ్జాలీ చెప్పారు. దేశంలోనే ఉండిపోయిన మిగతా దురదృష్టవంతులైన క్రీడాకారుల్లో మహజాబిన్ హకిమి ఒకరని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం తాలిబన్ ఫైటర్లు మహిళా అథ్లెట్స్ కోసం గాలించి వేటాడారని, దేశ విదేశాల్లో ఆడి ప్రతిభ చూపిన ఆఫ్ఘన్ మహిళా వాలీబాల్ టీమ్ సభ్యులపైనా వారి కన్నుపడిందని అఫ్జాలీ తెలిపారు. వాలీబాల్ జట్టుతోపాటు మహిళా అథ్లెట్లు గడ్డు పరిస్థితిలో ఉన్నారని, నిరాశతో భయాందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు. కొందరు భయంతో దేశం విడిచిపోగా మరికొందరు అజ్ఞాతంలో ఉన్నారంటూ వారి దుస్థితిని వివరించారు.ఆఫ్ఘనిస్థాన్‌లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పతనానికి ముందు కాబూల్ మున్సిపల్ వాలీబాల్ క్లబ్ తరుఫున ఆడిన స్టార్ క్రీడాకారిణుల్లో మహజాబిన్ హకిమి ఒకరు. కొన్ని రోజుల కిందట తెగిన ఆమె తల, నెత్తురోడిన మెడ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫిఫా, ఖతార్ ప్రభుత్వం గత వారం ఆఫ్ఘన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు సభ్యులు, వారి కుటుంబ సభ్యులతో సహా 100 మంది మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులను ఆ దేశం నుంచి తరలించాయి.