తెలుగు నాట గత మూడు దశాబ్దాలుగా అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్నారు అక్కినేని నాగార్జున. కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా.. హిందీ, తమిళ చిత్రాల్లోనూ సందడి చేశారు. బాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లోనూ తనదైన ముద్ర వేశారు. తాజా సమాచారం ప్రకారం.. నాగ్ మాలీవుడ్‌లో సందడి చేయబోతున్నారని తెలిసింది. కాస్త వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ రూపొందించనున్న చిత్రం ‘మరక్కర్: అరబికడలింతే సింహం’. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం నాగార్జునతో చర్చలు సాగుతున్నాయని తెలిసింది. తన పాత్ర, కథ నచ్చడంతో నాగ్ కూడా ఈ సినిమాలో నటించడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఒక వేళ నాగ్ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంటే.. ఆయన నటించే తొలి మలయాళ చిత్రం ఇదే అవుతుంది. త్వరలోనే నాగ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో బాలీవుడ్ యాక్షన్ హీరో సునీల్ శెట్టి నటించనున్నారు. అంతేగాకుండా.. ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ చిత్రాల సినిమాటోగ్రాఫర్ తిరు ఈ సినిమాకి ఛాయాగ్రహణం అందించనున్నారు. అలాగే.. ‘బాహుబలి’ మూవీకి ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేసిన సాబు సైరిల్ ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. నవంబర్ 1 నుంచి సెట్స్ పైకి వెళ్ళే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.