దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ముసలం మొదలైంది. అన్నాడీఎంకేలో మొదలైన ఆధిపత్య పోరు ప్రత్యర్థి పార్టీలకు వరంగా మారగా సొంతపార్టీకి శాపంగా మారింది. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలుగా విడిపోవడంతో కిందటి ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిపాలైంది. డీఎంకే అధికారంలోకి రావడానికి అన్నాడీఎంకేలోని లుకలుకలే ప్రధాన కారణమని ఆపార్టీ నేతలు చెబుతుండటం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకేను తాను దారిలో పెడుతానని 'చిన్నమ్మ' ప్రకటించుకోవడం విశేషం.జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ కార్యక్రమాలను శశికళ చూసుకునేవారు. ఒకనొక సమయంలో ఆమె సీఎం అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. అయితే అనుహ్య పరిణామాల నేపథ్యంలో శశికళ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కొన్నినెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆమె విడుదలయ్యారు. ఈ సమయంలోనే తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పాలయ్యాక ఆమె అవసరాన్ని అన్నాడీఎంకే గుర్తించినట్లు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే శశికళ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.శశికళ వచ్చి రావడంతోనే తానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శినని ప్రకటించుకున్నారు. ఆమెకు పన్నీర్ సెల్వం మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరో నాలుగేళ్ల వరకు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలేవు. దీంతో ఆమె ఇప్పటికిప్పుడు అన్నాడీఎంకేను ఉద్ధరించాల్సిన అవసరం లేదనే టాక్ విన్పిస్తోంది. అయినా సరే పార్టీని తమ గ్రిప్ లోకి తెచ్చుకునే ప్రయత్నం శశికళ చేస్తుండగా బీజేపీకి తొలి నుంచి మద్దతు ఇస్తున్న పన్నీర్ సెల్వం ఆమెకు అండగా నిలుస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే బీజేపీ శశికళను రంగంలోకి దింపిందనే టాక్ తమిళనాడులో విన్పిస్తోంది.దక్షిణాదిలో బీజేపీకి కర్ణాటక మినహా ఎక్కడ సరైన బలం లేదు. జయలలిత సీఎంగా ఉన్న సమయంలో తమిళనాడులో బీజేపీని పక్కనపెట్టారు. ఆమె మరణం తర్వాత బీజేపీకి అక్కడ పట్టు దొరికింది. పన్నీర్ సెల్వంను మచ్చిక చేసుకొని అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. అయితే అన్నాడీఎంకేలో నేతల మధ్య అధిపత్య పోరు కారణంగా ఆపార్టీ కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఈ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై పడకుండా బీజేపీ ముందస్తు ప్లాన్ చేస్తోంది.ప్రస్తుతం అధికారంలోకి ఉన్న డీఎంకే బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఆపార్టీ కాంగ్రెస్ తో కలిసి నడుస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే ఎక్కువ స్థానాలు సాధిస్తే బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే పన్నీర్ సెల్వం మద్దతుతో శశికళను బీజేపీ తిరిగి అన్నాడీఎంలోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పన్నీర్ సెల్వం పార్టీని నిలబట్టే కంటే పళనీస్వామిని దెబ్బతిసేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతోనే ఆయన శశికళకు మద్దతు ఇస్తున్నట్లు కన్పిస్తోంది. అయితే ఇదంతా కూడా పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ వేసిన స్కెచ్ లో భాగమనేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.