విశాఖపట్టణం, అక్టోబరు 25,
రాజకీయ భవిష్యత్‌పై ఎన్నో ఊహాగానాలు, మరెన్నో అంచనాలు వినిపించాయి. కానీ.. హఠాత్తుగా యూటర్న్ తీసుకుని ఇప్పుడు మళ్లీ పార్టీకి విధేయత ప్రకటిస్తున్నారు. ఇంతకీ ఆయనలో వచ్చిన ఈ మార్పునకు కారణం ఏంటి? ఎవరా నాయకుడు?గంటా శ్రీనివాసరావు. విశాఖజిల్లా రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా ఒక వెలుగు వెలిగారు. మిగిలిన రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో వ్యూహాలను మారిస్తే.. గంటా మాత్రం నియోజకవర్గాలను.. పార్టీలను మారుస్తారనే విమర్శ ఉంది. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచారు. టీడీపీ అధికారం కోల్పోవడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు గంటా. నియోజకవర్గ బాధ్యతలను మేనల్లుడి చేతుల్లో పెట్టేసి..కేడర్‌కు, ప్రజలకు దూరం పాటిస్తూ వచ్చారు ఈ మాజీ మంత్రి. రెండేళ్లుగా ఇదే వైఖరిని ప్రదర్శించడంతో గంటా రాజకీయంగా ఎటువైపు వెళతారనేది ఎప్పుడూ చర్చగా ఉండేది. సమయం వచ్చినప్పుడు రాజకీయ భవిష్యత్‌పై చెబుతాను అనేవారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే గంటా పార్టీ మారిపోతారని ప్రచారం జరిగింది. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేసినట్టు స్వయంగా అధికారపార్టీ నేతలే చర్చించుకునేవారు. మంత్రి అవంతి శ్రీనివాస్, మరో కీలక నేత వ్యతిరేకించిన కారణంగా గంటాకు వైసీపీలో ఎంట్రీ దక్కలేదనేది మరో ప్రచారం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేక పోరాటం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం పెద్ద సంచలనమైంది. రాజీనామాను ఆమోదించాలని గంటా కోరినప్పటికీ ఎటువంటి పురోగతి లేదు. చంద్రబాబుకు చెప్పకుండా రాజీనామా చేయడంతో టీడీపీతో తెగతెంపులు ఖాయమని అనుకున్నారు.ఇప్పుడు గంటా యాక్టివ్ కావడంతో.. గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గాల నుంచి నాయకులు వచ్చి మాట్లాడి వెళ్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత కాపు నాయకులతో మాజీ మంత్రి సమావేశం ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై వీరి మధ్య చర్చ జరిగిందట. దీంతో గంటా చూపు జనసేన వైపు మళ్లిందా అనే ఊహాగానాలు వినిపించాయి. అయితే గంటా ఎక్కడా బయటపడకపోగా టీడీపీకి విధేయతను చాటే ప్రయత్నం చేయడం స్వపక్షానికి, విపక్షనికి కొత్తగా కనిపిస్తోందట.టీడీపీ నేత పట్టాభి కామెంట్స్ అనంతర పరిణామాలపై గంటా స్పందించిన తీరు కొత్తగా ఉందట. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన.. మరోసారి పార్టీలో చురుగ్గా మారేందుకు ప్రయత్నిస్తున్నారనే సంకేతాలు వెలువడ్డాయి. అధిష్ఠానం బంద్ పాటించమని ఆదేశిస్తే రెస్పాండ్ అయ్యారు గంటా. నియోజకవర్గస్ధాయిలో నిరసనలు గట్టిగా జరగాలని నిర్ధేశించారు. చంద్రబాబు దీక్షకు బహిరంగ మద్దతు ప్రకటించారు కూడా. గంటా తాజా చర్యలను అధికారపార్టీ ఎండగడుతోంది. ఇంతకాలం జనం గురించి పట్టించుకోని గంటాకు ముఖ్యమంత్రిని దూషించిన వారిని వెనకేసుకుని రావడం ఎంతవరకు సమంజసమో చెప్పాలని బహిరంగ వేదికలపై ప్రశ్నిస్తోంది. వాస్తవానికి గంటా శ్రీనివాస్ తాను ఎప్పుడూ పార్టీ మారతానని కానీ.. ఆ ఉద్దేశం ఉందని కానీ బయటపడలేదు. సమయం వచ్చినప్పుడు చెబుతాను అనే మాట తప్ప బయటపడిన దాఖలాలు లేవు. ఇప్పుడు వేస్తున్న ఎత్తుగడలు చూస్తే వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఆయన టీడీపీలోనే కొనసాగుతూ.. మరోసారి భీమిలి నుంచి పోటీ చేస్తారని సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్నాయి.