YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ కంటే ఎక్కువ మెజార్టీ

జగన్ కంటే ఎక్కువ మెజార్టీ

కడప, నవంబర్ 2,
బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ బంపర్ మెజార్టీతో విక్టరీ కొట్టింది. బరిలో నిలిచిన కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్స్ కూడా గల్లంతయ్యాయి. బద్వేల్‌లో మొత్తం 13 రౌండ్ల కౌంటింగ్‌ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి సుధ 90, 533 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం వ్యాలీడ్ ఓట్లు 1,47,163 కాగా.. వైసీపీకి 1,12,211 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 21,678 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు మొత్తం 6,235 ఓట్లు వచ్చాయి. నోటాకు 3,650 ఓట్లు పోల్ అయ్యాయి. డాక్టర్ సుధకు వచ్చిన మెజార్టీ వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. 2019 ఎన్నికల్లో జగన్ పులివెందుల అసెంబ్లీ నియోజవర్గం నుంచి  90,110 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. మొత్తం పోలైన 1,80,127 ఓట్లలో జగన్మోహన్ రెడ్డికి 1,32,356 ఓట్లు వచ్చాయి.  2014 ఎన్నికల్లో జగన్‌కు 75243 ఓట్ల మెజార్టీ వచ్చింది.ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సుపరిపాలన, ఆయన అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే తనను గెలిపించాయన్నారు డాక్టర్ సుధ. తన విజయానికి సహకరించిన వైసీపీ నేతలకు, బద్వేల్‌ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. బద్వేల్‌లో భారీ మెజారిటీతో గెలుపొందిన వైసీపీ అభ్యర్థి సుధ ఎన్నికల అధికారి నుంచి డిక్లరేషన్‌ తీసుకున్నారు.బద్వేల్‌లో భారీ విజయాన్ని సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే భారీ విజయం సాధించగలిగామని తెలిపారు. 2024 ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు రిపీట్‌ అవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.
డిపాజిట్లు గల్లంతు
ద్వేల్‌ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 76.25 శాతం ఓట్లను వైఎస్సార్‌సీపీ సాధించింది. 90,533 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ ఘన విజయం సాధించారు. మొదటి నుంచి ప్రతి రౌండ్‌లోనూ వైఎస్సార్‌సీపీ ఆధిక్యతతో దూసుకుపోయింది. వైఎస్సార్‌సీపీకి మొత్తం 1,12,211 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 21,678 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు మొత్తం 6,235ఓట్లు వచ్చాయి. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ వైఎస్సార్‌సీపీ మెజారిటీ ఓట్లు దక్కించుకుంది.బద్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోయాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినా డిపాజిట్లు గల్లంతయ్యాయి. బద్వేల్ ప్రజలు, సీఎం జగన్‌  వెంటే ఉన్నారని డాక్టర్‌ సుధ అన్నారు. గతంలో కంటే రెట్టింపు మెజార్టీతో గెలిపించారని.. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారని డాక్టర్‌ సుధ పేర్కొన్నారు
అంతా టీడీపీ చేసింది
బద్వేల్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో మొదటనుంచి అధికార వైసీపీ జోరు కొనసాగుతూ వచ్చింది. గతంలో ఎన్నడూలేని విధంగా వైసీపీ భారీ మెజార్టీతో గెలుపొందింది. బద్వేల్‌లో వైసీపీ గెలుపు అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్‌ గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ విజయం ప్రజా విజయమని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా తీర్పు సంతోషంగా ఉందని తెలిపారు. బద్వేల్ వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ఓటర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మెజారిటీతో వైసీపీ బాధ్యత మరింత పెరిగిందని స్పష్టంచేశారు. గత రెండున్నారేళ్ల కాలంలో పలు పార్టీల నాయకులు అనేక నిందలు మోపారని పేర్కొన్నారు. బీజేపీ కాంగ్రెస్ పోటీలో ఉన్నా.. కథ మొత్తం నడిపింది టీడీపీనే అని శ్రీకాంత్‌ రెడ్డి వెల్లడించారు. ప్రజాతీర్పు ఏకపక్షంగా ఉందని.. ప్రతిపక్షాలకు గుణపాఠం తెలిపారని వెల్లడించారు. వైసీపీ ప్రజలను నమ్ముకున్న పార్టీ అని స్పష్టంచేశారు. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారని.. సీఎం జగన్ నాయకత్వానికి, వైసీపీకి పెద్ద ఎత్తున మద్దతిచ్చినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎవరైనా ప్రజా తీర్పును గౌరవించాలని, ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఈ విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. బీజేపీ వెనకాల నుంచి మొత్తం నడిపించిందని.. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఓటర్లు సరైన సమాధానమిచ్చారని పేర్కొన్నారు.
సీటు కాదు గేటు కూడా
 సెంటర్ అయినా, ఎలక్షన్‌ ఏదైనా, ఓన్లీ సింగిల్‌ హ్యాండ్‌ అంటూ సినిమా స్టైల్లో పంచ్‌ డైలాగులు పేల్చారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఎవరినైనాసరే సింగిల్‌ హ్యాండ్‌తో మట్టికరిపించగల సత్తా జగన్మోహన్‌రెడ్డికి ఉందన్నారు. బద్వేల్‌లో గెలిచేందుకు టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీలు మూకుమ్మడిగా చేతులు కలిపి.. కుటిల ప్రయత్నాలు చేశారని అన్నారు.  అయితే బద్వేల్ ప్రజలు చంద్రబాబుని చితకబాది తరిమికొట్టారన్నారు. ఎమ్మెల్యే సీటు కాదు కదా… అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ వైసీపీ ప్రత్యర్థులకు బద్వేల్‌ ఓటర్లు బుద్ధిచెప్పారని అన్నారు.గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 45 వేల మెజార్టీ కట్టబెట్టిన బద్వేల్ నియోజకవర్గ ప్రజలు..  జగనన్న పాలనను చూసి ఇప్పుడు 90 వేలకు పైగా మెజార్టీ కట్టబెట్టారని అన్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని పార్టీని గెలిపించిందని వ్యాఖ్యానించారు.

Related Posts