హుజూరాబాద్ ఉప ఎన్నికలు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారాయి. అక్కడ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనే దానికంటే ఈటల వర్సెస్ కేసీఆర్ కేంద్రంగా ఎన్నికలు జరిగాయనడమే సముచితంగా ఉంటుందేమో. ఈటల మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమయింది. టీఆర్ఎస్‌లో ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న ఈటలపై కేసులతో ఒత్తిడి పెంచి మరీ పార్టీ మారాల్సిన పరిస్థితిని టీఆర్ఎస్ క్రియేట్ చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. ఈటల రాజేందర్‌ను ఎలాగైనా ఓడించాలన్న పంతంతో టీఆర్ఎస్ అధినాయకత్వం పనిచేసింది. హరీశ్ రావును ఎన్నికల వ్యూహకర్తగా హుజూరాబాద్‌కు కేసీఆర్ పంపించారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లోని ఊరూరా పర్యటించారు. దళిత బంధు పథకం ప్రకటించారు. కొందరికి డబ్బులు కూడా ఖాతాలో వేశారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేస్తూ టీఆర్ఎస్ గెలుపు కోసం సర్వశక్తులను ఒడ్డారు. కానీ ప్రస్తుతం వస్తున్న ఫలితాలు మాత్రం టీఆర్ఎస్‌కు ఊహించని షాకిచ్చాయనే చెప్పాలి. అయితే గత ఎన్నికలతో పోల్చితే ఈటల రాజేందర్ మెజార్టీని మాత్రం టీఆర్ఎస్ గణనీయంగా తగ్గించగలగడం గమనార్హం.2018 ముందస్తు ఎన్నికల్లో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ ప్రత్యర్థి కౌశిక్ రెడ్డిపై 43,719 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు 1,04,840 ఓట్లు పోలయ్యాయి. పోలయిన మొత్తం ఓట్లలో 59.34 శాతం ఓట్లు ఈటలకే పడ్డాయి. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డికి 61,121 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 2,867 ఓట్లు పడ్డాయి. మొత్తం మీద 43 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో ఈటల గెలిచారు. ఆ ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవిని కూడా స్వీకరించిన ఈటలకు రెండేళ్లు కూడా తిరక్కముందే ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. దీంతో ఈటల పార్టీ మారి.. బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరడంతో పోరు రసవత్తరంగా మారింది.ఇప్పటి వరకు నడుస్తున్న ట్రెండ్‌ను బట్టి గత ఎన్నికల్లో వచ్చినంత మెజార్టీ అయితే ఈటలకు రాదనే చెప్పవచ్చు. కౌంటింగ్ మొత్తం పూర్తయ్యేసరికి ఈటలకు పది వేల లోపు మెజార్టీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈటల మెజార్టీని గణనీయంగా తగ్గించడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయిందనీ.. అదే సమయంలో ఈటల తన సొంత బలాన్ని ఊహించనంత రేంజ్‌లో పెంచుకోవడం గమనార్హమని చెబుతున్నారు. ఇప్పుడు ఈటలకు వచ్చిన ఓట్లలో మెజార్టీ శాతం ఓట్లు బీజేపీని చూసి కాకుండా.. ఈటలపై అభిమానంతోనో, ఆయనపై సానుభూతితోనో, ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో వచ్చినవేనని చెబుతున్నారు.