కరీంనగర్, నవంబర్ 2,
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఫలితాల్లో ఉత్కంఠ ఫలితాలు వచ్చాయి. ఎనిమిదో రౌండ్ వరకు దూకుడు మీదున్న బీజేపీ అభ్యర్థికి బ్రేకులు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి ముందుకు దూసుకొచ్చారు. ఆ వెంటనే మరో రౌండ్‌లో అంతే వేగంగా వెనుదిరిగారు. అంతేకాదు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు స్వగ్రామంతో పాటు అత్తగారి ఊరులోనూ ఊహించని షాక్ తగిలింది. గెల్లు శ్రీనివాస్ స్వగ్రామమైన హిమ్మత్‌నగర్‌లో ఈటల రాజేందర్‌కే అత్యధిక ఓట్లు నమోదు అయ్యాయి. అలాగే.. అత్తగారి గ్రామంలోనివారు సైతం అతనికి ఓట్లు వేయకుండా హ్యాండ్ ఇచ్చారు. వీణవంక మండలం హిమ్మత్నగర్‌కు చెందిన గెల్లును అత్తగారి ఊరైన హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లె ఓటర్లు కనీసం ఆయన దిక్కు కూడా చడలేదు. పెద్దపాపయ్యపల్లెలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 76 ఓట్లు ఆధిక్యం వచ్చింది.అంతే కాకుండా యాదవ సామాజికవర్గం అధికంగా ఉన్న వెంకటరావు పల్లెతోపాటు సీఎం కేసీఆర్ దళిత బంధు ప్రకటించిన శాలపల్లిలో కూడా ఓటర్లు ఆదరించలేదు. అంతేకాదు టీఆర్ఎస్ ఎంపీ కెప్టెన్ లక్ష్మి కాంతారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్వగ్రామమైన సింగపూర్‌లో కూడా ఇదే పరిస్థితి గులాబీ పార్టీకి కనిపించింది.