కొత్త పద సృష్టి. నూతన నిర్వచనాలు..ఎత్తిపొడుపులోనూ ఏదో నవీనత…హాస్యం..వ్యంగ్యం..వెటకారం వెరసి ..కన్నడ నాట ప్రచార హంగామా బహు పుంతలు తొక్కుతోంది. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి సిద్దరామయ్య పోటాపోటీ పదకల్పనలతో భాషకు పరిపుష్టి చేకూరుస్తున్నారు. పదాలలోని తొలి అక్షరాలను కలిపి ఒక కొత్త పదాన్ని పుట్టిస్తూ ఎగతాళి చేయడమనేది ఆకర్షణీయమైన ప్రచారంగా మారింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెసు, బీజేపీలు మూడు ‘పీ’ లతో ముచ్చట తీర్చుకున్నాయి. ముందుగా ప్రధాని మోడీ కాంగ్రెసు పార్టీ పని అయిపోయిందనే రీతిలో వ్యాఖ్యానిస్తూ పీపీపీ లు మాత్రమే కాంగ్రెసుకు మిగిలేది అన్నారు. ఒక పీ ..పంజాబ్, మరో పీ పుదుచ్చేరి ఇంకో పీ పరివార్ (గాంధీ కుటుంబం) మాత్రమే కాంగ్రెసుకు మిగులుతాయన్నారు. దీనిని తిప్పికొడుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్య బీజేపీ మూడు ‘పీ’లనే నమ్ముకుంటోందన్నారు. దానికి తనదైన నిర్వచనాన్నిచ్చారు. బీజేపీ పీ అంటే ప్రిజన్ (గాలి, యెడియూరప్ప కేసులు) మరొక పీ అంటే ప్రైస్ రైజ్ (ధరల పెరుగుదల) చివరి పీ అంటే పకోడా ( నిరుద్యోగానికి పరిష్కారంగా చెప్పిన చిట్కా) లనే వారు నమ్ముకుంటున్నారన్నారు. అదే సమయంలో అవే పదాలతో తమను తాము సమర్థించుకున్నారు సిద్ధరామయ్య. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆప్ ద పీపుల్ పనిచేసే పార్టీ తమదేనని కాంగ్రెసును వెనకేసుకొచ్చారు.అయితే అది తిట్లరూపం సంతరించుకుని వెగటు పుట్టిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు తాము చేసే కార్యక్రమాల గురించి చెప్పడం ద్వారా ప్రజాభిమానాన్ని సాధించాలన్న సంగతిని పక్కనపెట్టేశారు.ఒక అంశమని లేదు. అసలు వ్యక్తిగత విషయాలు మొదలు పార్టీ తప్పిదాల వరకూ దుమ్మెత్తి పోసుకోవడమే ప్రధానంగా సాగుతోంది కన్నడ రణఘోష. పరిధులు,పరిమితులు లేవు. అందులోనూ ఉన్నత రాజకీయ, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే తమ స్థాయిని, హోదాను, సభ్యతను మరిచిపోయి మరీ ఆరోపణలకు దిగడం కన్నడ నాట కొత్త చరిత్రను సృష్టించింది. మతం, కులం, ప్రాంతీయత ల పరిధి దాటి ప్రత్యేక జెండా వరకూ పరిస్థితులను దిగజార్చారు. మతాన్ని, పీఠాలను, లింగాయత్ ఓటు బ్యాంకును పట్టుకుని ఈసారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ శతవిధాలా యత్నిస్తోంది. దీనికి గండికొట్టేందుకు అధికారాన్ని కాపాడుకొనేందుకు కాంగ్రెసు అష్టకష్టాలు పడుతోంది. కన్నడ వీరాభిమానాన్ని, ప్రత్యేక జెండాను, లింగాయత్ లలో ప్రత్యేక మతవాద చిచ్చు ను పెట్టడం ద్వారా అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. సిద్ద రూపయా సర్కారు అంటూ అవినీతికి మారు పేరు అనే అర్థం ధ్వనించేలా ప్రధానమంత్రే రంగంలోకి దిగిపోయారు. ఏదేమైనప్పటికీ సొంతంగా తమ పరువు, సమష్టిగా పార్టీల పరువు నాయకులు బజారున పడేసుకున్నారు. ప్రత్యర్థులను పరాచకాలాడటం ద్వారా పాపులారిటీ సాధించాలన్నా చిల్లర ఎత్తుగడలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలాటను తలపిస్తున్న ప్రచార శైలి ఓటర్లకు మాత్రం భలే హాస్యం పంచుతోంది.మేము నామ్ ధారీ లము కాదు, కామ్ ధారీలమంటూ మోడీ ఎక్కుపెట్టిన మరో వ్యంగ్యాస్త్రం కూడా ప్రచారాన్ని హుషారెత్తించింది. గాంధీ పేరు పెట్టుకున్నరాహుల్ ను నామ్ ధారీ అంటూ ఎత్తిపొడుస్తూ తాము పనితీరు ద్వారానే గుర్తింపు తెచ్చుకుంటామంటూ కామ్ ధారీలుగా తమను తాము అభివర్ణించుకున్నారు. మోడీ వక్తగానే కాకుండా సందర్భోచితంగా, సమయ స్ఫూర్తితో విసిరే చెణుకులు ప్రచారంలో జోరు నింపుతున్నాయి. పదాల విసుర్లు, ఆకట్టుకునే తీరులో చెప్పడం ఆయన ప్రసంగానికి అదనపు ఆకర్షణ. అటు రాహుల్, సిద్ధరామయ్యలు మోడీకి సరిజోడులుగా నిలవడం కష్టమే అయ్యింది.ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల మీద పరువు నష్టం దావా వేయడం ఎన్నికలలో కొసమెరుపు.