ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటోన్న అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠాను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు.వారి నుంచి 3,305 కిలోల ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి సుమారు కోటి రూపాయలకు పైగానే విలువ చేస్తాయని పోలీసులు చెబుతున్నారు.ఈ ముఠాలోని ఇద్దరు కీలక నిందితులు విదేశాల్లో ఉంటూ ఈ అక్రమ వ్యాపారానికి తెరతీశారు. ఇందుకోసం తమిళనాడుకు చెందిన కొందరు ఎర్రచందనం కూలీల సహాయం తీసుకున్నారు. వైఎస్సార్ కడప, చిత్తూరు అడవుల నుంచి దొంగలించిన ఎర్రచందనాన్ని ముందుగా తమిళనాడుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి శ్రీలంకకు..ఆపై సముద్ర మార్గంలో చైనా తదితర విదేశాలకు రవాణా చేస్తున్నారు.
ఈ మేరకు ఎర్రచందనం అక్రమ రవాణా గురించి అనంతపురం పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో చిలమత్తూరు మండలం కొడికొండ వద్ద రెడ్ హ్యాండెడ్‌గా ఎర్రచందనం స్మగ్లర్ల ముఠాను పట్టుకున్నారు. మొత్తం 19 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 3,305 కిలోల ఎర్ర చందనం, 5వాహనాలు, 19 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకు న్నారు. నిందితుల వద్ద దొరికిన ఎర్రచందనం విలువ రూ.కోటికి పైగానే విలువ చేస్తోందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పట్టుబడ్డ వారిలో 8మంది తమిళనాడు ముఠా సభ్యులు కూడా ఉన్నారని వారు పేర్కొన్నారు.