కరీంనగర్, నవంబర్ 3,
గెలుపోటములను కాసేపు పక్కన పెడదాం. ఈటల రాజేందర్ మాత్రం కారు పార్టీకి చుక్కలు చూపించారనే చెప్పాలి. ప్రతి రౌండ్ లోనూ తనదే పైచేయి చూపించుకుని అధికార పార్టీని అల్లాడించారు. అయితే ఇది బీజేపీ కంటే ఈటల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే ఈ ఎన్నికల్లో పనిచేసిందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. సానుభూతి బాగా పనిచేసింది. హుజూరాబాద్ ప్రజలు భావోద్వేగాలకు లోనయ్యారని ఈ ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ బీజేపీ అనే కంటే ఈటల అనడం సబబు.ఈటల రాజేందర్ కు అన్ని రకాల క్యాలిక్యులేషన్ లు అనుకూలించాయనే చెప్పాలి. ఇప్పటి వరకూ ఆరుసార్లు ఇక్కడ టీఆర్ఎస్ గెలిచింది. అభ్యర్థి కూడా ఈటల రాజేందర్ మాత్రమే. అయితే ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తొలగించిన విధానం హుజూరాబాద్ ప్రజలను హర్ట్ చేసిందంటున్నారు. ఈటల రాజేందర్ ను ఒంటరి చేసి ఆయనపై కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం కూడా ప్రజలు తప్పుపట్టినట్లే కన్పిస్తుంది.ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ లో ఒక నేతగా హుజూరాబాద్ ప్రజలు చూడలేదు. ఆయనలో ఉద్యమ కారుడిని చూశారు. కేసీఆర్ కు ఎదురొడ్డి నిలిచిన ధీరుడిగా భావించారు. అందువల్లనే ప్రతి రౌండ్ లోనూ ఈటలకు ఎంతో కొంత మెజారిటీ లభించింది. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ తనతో పాటు టీఆర్ఎస్ ఓట్లను కూడా తీసుకెళ్లగలిగారు. టీఆర్ఎస్ లో కేవలం నేతలు మాత్రమే మిగిలారు. ఈటల పక్కన ఉండే నేతలను టీఆర్ఎస్ ఆకర్షించగలిగినా ఆయనకు పెద్దగా నష్టం వాటిల్లలేదని చెప్పొచ్చు.మరోవైపు రెడ్డి సామాజికవర్గం ఓట్లు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయంటున్నారు. కరీంనగర్ జిల్లాలో రెడ్డి వర్సెస్ వెలమ అన్నట్లు ఉంటుంది. దీంతో టీఆర్ఎస్ తెలివిగా కౌశిక్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని బలపడాలని ప్రయత్నించింది. కానీ ఆ ప్రయోగం కూడా విఫలమయినట్లే అనుకోవాలి. రెడ్డి సామాజికవర్గంతో పాటు ఇతర కులాలు కూడా ఈటల వైపు చూసేలా చేశాయి. అక్కడ నేతలకు వరస బెట్టి ఇచ్చిన పదవులు కూడా వికటించిన ప్రయోగంగానే చెప్పుకోవాలి. మొత్తం మీద ఈటల రాజేందర్ గెలిచినా, గెలవకపోయినా టీఆర్ఎస్ ను రఫ్ఫాడించాడనే చెప్పాలి.
కనీస పోటీ ఇవ్వలేకపోయిన గులాబీ :
హుజూరాబాద్ ఉప ఎన్నిక దేశంలో అత్యంత ఖరీదైన ఎన్నికగా భావించాలి. వందల కోట్లను అక్కడ కుమ్మరించారు. బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఇక్కడ గెలుపోటములు పక్కన పెడితే దళిత బంధు పథకం ఇక్కడ పెద్దగా వర్క్ అవుట్ అయినట్లు కన్పించలేదు. ఈ పథకంపైనే అధికార టీఆర్ఎస్ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈటలపై వన్ సైడ్ విజయం సాధించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. అందుకే సర్వే చేసి మరీ కేసీఆర్ గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్థిగా నిర్ణయించారు.కానీ వస్తున్న ఫలితాలను చూస్తుంటే 23 రౌండ్లలో ఒక్క రౌండ్ లోనే టీఆర్ఎస్ ఆధిక్యత కనపర్చింది. దళిత బంధు పథకాన్ని కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే ప్రవేశపెట్టారంటారు. ఒక్కొక్క దళిత కుటుంబానికి పది లక్షలు ఇచ్చే పథకం దేశంలో ఎక్కడా లేదు. ప్రయోగాత్మకంగా దళిత బంధును హుజూరాబాద్ లోనే ప్రవేశపెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత టీఆర్ఎస్ కు ఇక్కడ కేక్ వాక్ కావాల్సి ఉంది. అయితే ఇదే ఇక్కడ టీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.నిజానికి టీఆర్ఎస్ పెట్టిన ఖర్చుకు, ప్రవేశపెట్టిన పథకాలకు, ఎన్నికలకు ముందు హుజూరాబాద్ లో చేసిన అభివృద్ధికి ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ సోదిలో లేకుండా ఓడించాల్సి ఉంది. ఓటుకు ఆరు నుంచి పదివేలు ఇచ్చినట్లుగా కూడా ఆరోపణలు విన్పించాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలను దత్తత తీసుకుని మరీ వ్యూహాలను రచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం హుజూరాబాద్ పై రివ్యూలు చేస్తూనే ఉన్నారు.అయితే టీఆర్ఎస్ ఆశలు గల్లంతయ్యాయనే చెప్పాలి. టీఆర్ఎస్ ఊహించినదానికి భిన్నంగా జరిగిందనే చెప్పాలి. హుజూరాబాద్ లో గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఓటింగ్ శాతం పెరగడంతో అధికార పార్టీ ఆశలు పెరిగాయి. తాము వేసిన స్కెచ్ సక్సెస్ అయిందనుకున్నారు. ప్రవేశ పెట్టిన పథకాలు, పంచిన సొమ్ములు పనిచేశాయని భావించారు. కానీ ఫలితాలు చూస్తే మాత్రం ఇవేవీ పనిచేయలేదనే అనుకోవాలి. మొత్తం మీద హుజూరాబాద్ లో కారు పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారనే అనుకోవాలి. గెలుపోటములు ఎలా ఉన్నా టీఆర్ఎస్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో విఫలమయిందనే చెప్పాలి.