హైద్రాబాద్, నవంబర్ 3,
వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్(వీవోఐపీ) ఫోన్ కాల్స్ చాలా ప్రమాదకరంగా మారాయి. ఈ ఫోన్ కాల్స్‌ను క్రిమినల్స్ ఉపయోగిస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ ఫోన్ కాల్స్ నేరుగా ఇంటర్నెట్ ద్వారా వస్తుండటంతో వీటిపై డీవోటీ ( డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్) నిఘా ఉండటం లేదు. దీంతో వీటిని వెంటనే గుర్తించాలంటే పోలీసులకు చాలా కష్టంగా మారింది. ఈ వీవోఐపీ కాల్స్ ద్వారా స్థానికంగా ఉన్నా.. విదేశీ నంబర్లతో ఫోన్ చేయొచ్చు...అదే విధంగా మనకు తెలియకుండానే మన ఫోన్ నంబర్ల ద్వారా కూడా ఫోన్‌లు చేసి.. నేరాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే.. పోలీసుల దర్యాప్తులో భాగంగా ఆ ఫోన్‌కాల్స్‌ను విశ్లేషించే క్రమంలో కొంత గందరగోళానికి గురవుతున్నారు. దీనికి తోడు ఈ వీవోఐపీ కాల్స్ అందించే సంస్థలు పోలీసుల విజ్ఞప్తికి వేగంగా స్పందించకపోవడంతో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన కిడ్నాప్‌లు, హత్యలు కూడా ఈ కాల్స్‌ను ఉపయోగించి నిందితులు తప్పించుకోవాలని చూశారు. కానీ.. తెలంగాణ పోలీసులు ఆధునిక పరిజ్ఞానంతో వారిని పట్టుకున్నారు. అయితే.. ఈ వీవోఐపీ కాల్స్ ఎప్పటికీ ప్రమాదమే... వాటి నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ పోలీసు అధికారులు కోరుతున్నారు. ఇటీవల నగర శివారు రాజేంద్రనగర్ బండ్లగూడ ప్రాంతం లో డెంటల్ డాక్టర్ హూస్సేన్ కిడ్నాప్ తర్వాత దుండగులు వీవోఐపీ కాల్స్‌ను ఉపయోగించారు. దీని కోసం మలేషియా దేశానికి చెందిన కోడ్ 6033 తో మొదలయ్యే నంబర్‌తో ఫోన్ చేసి.. రూ. 10 కోట్లు డిమాండ్ చేశారు. అదే ఫోన్ నంబర్‌తో వాయిస్ రికార్డు చేసి.. 48 గంటల్లో డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని హెచ్చరించారు. పోలీసులకు మొదట ఈ నంబర్ లభించడంతో కొంత గందరగోళానికి గురయ్యారు. అయితే.. కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడంతో దుండగుల గుట్టు రైట్టెంది. దీనికి తోడు సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు డెంటల్ డాక్టర్‌ను సురక్షితంగా ఇంటికి చేర్చారు. మహబుబాబాద్‌లో విషాదాన్ని మిగిల్చిన దీక్షిత్‌రెడ్డి ఘటనలో కూడా కిడ్నాపర్, హంతకుడు తన ఆచూకీ తెలియకుండా డింగ్ టోన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని 15 అంకెలు గల అమెరికా నంబర్‌తో ఫోన్ చేసి... డబ్బులు డిమాండ్ చేశాడు. మొదట్లో పోలీసులు కూడా ఈ నంబర్‌ను చూసి కొంత అవాక్కయ్యారు. ఆ తర్వాత వివిధ పోలీస్ కమిషనరేట్‌లు, జిల్లాల పోలీసుల సహాయంతో ఆరా తీయగా... ఇది వీవోఐపీ నంబర్‌గా గుర్తించారు. ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. వివిధ మార్గాల ద్వారా శోధించిన పోలీసులు చివరకు హంతకుడిని పట్టుకున్నారు. వీవోఐపీ కాల్స్‌కు సంబంధించి చా లా యాప్‌లు ఉన్నాయి. అయితే.. ఈ యాప్‌ను రూపొందించిన వారు వినియోగదారులను ఆకర్షించేందుకు.. మొదట 3 నుంచి 4 ఫోన్ కాల్స్‌ను ఉచితంగా ఇస్తున్నారు. నేరాలకు పాల్పడేవారు ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉచిత కాల్స్ పొంది.. వాటి ద్వారా బెదిరింపులు, ఇతర నేరాలకు పాల్పడుతున్నారు. ఉచిత కాల్స్ అయిపోగానే యాప్ సంస్థలు రీచార్జి కింద డబ్బులు వసూలు చేయడంతో క్రిమినల్స్ కేవలం ఉచితం పైనే వచ్చే కాల్స్‌ను వారికి అనువుగా మార్చుకుని నేరాలు చేస్తున్నారు.