బీజింగ్,
చైనా తమ దేశ ప్రజలకు సూచన చేసింది. ఆహార పదార్ధాలతో పాటు ఇతర నిత్యావసరాలను నిల్వ చేసుకోవాలంటూ కుటుంబాలకు ప్రభుత్వం సూచించింది. వాతావరణం సరిగా లేకపోవడం, ఇంధనం కొరత, కోవిడ్19 నిబంధనల వల్ల రవాణా సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు చైనా పేర్కొన్నది. ఆ దేశానికి చెందిన వాణిజ్య శాఖ ఈ ప్రకటన చేసింది. ప్రజలు నిత్యావసరాలను నిల్వ చేసుకునే విధంగా స్థానిక ప్రభుత్వాలు ప్రోత్సహించాలని వాణిజ్య శాఖ తన ఆదేశాల్లో పేర్కొన్నది. కూరగాయలు, నూనెలు, పౌల్ట్రీ ఉత్పత్తులు వంటి వాటిని స్టాక్ పెట్టుకోవాలని ప్రభుత్వం చెప్పింది. రోజువారీగా అవసరం వచ్చే వస్తువులను సమకూర్చుకోవాలని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ ఏడాది చలికాలం నుంచి వచ్చే ఏడాది ఎండాకాలం వరకు నిత్యావసర సరకుల లోటు లేకుండా చూసుకోవాలని స్థానిక ప్రభుత్వాలను కోరింది.అకస్మాత్తుగా చైనా వార్నింగ్ ఇవ్వడంతో.. సోషల్ మీడియాలో ప్రజలు షాక్ వ్యక్తం చేవారు. తైవాన్‌తో తగవు ఉన్న నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆహారం నిల్వ చేసుకోవాలన్న ఆదేశాలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వాణిజ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలోనూ చైనా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. జీరో కోవిడ్ విధానాన్ని అవలంబిస్తోంది. కరోనా వైరస్‌ను అదుపు చేసే ఉద్దేశంతో అమలు చేస్తున్న నిబంధనల వల్ల ఆహాధాన్యాల ధరలు పెరిగి ఉంటాయని బీజింగ్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.