విజయవాడ, నవంబర్ 5,
చంద్రబాబు 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ట్రాప్ లో పడ్డారు. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రస్తావించారు. వైసీపీ ప్రత్యేక హోదాపై రెచ్చగొట్టడం, తరచూ ప్రధాని కార్యాలయంలో వైసీపీ నేతలు కనిపిస్తుండటం వంటి వాటితో చంద్రబాబు ఉడికిపోయారు. ఫలితంగా చంద్రబాబు ఇంకా ఎన్నికలు ఏడాదిన్నర మిగిలి ఉన్న సమయంలో బీజేపీతో స్నేహానికి బై బై చెప్పేశారు. మంత్రి వర్గం నుంచి తప్పుకున్నారు.ఇప్పుడు జగన్ ఆ తప్పు చేయదలచుకోలేదు. జగన్ అసలు కేంద్ర ప్రభుత్వంలోనే చేరలేదు. బయట నుంచి బీజేపీకి మంచి మద్దతుదారుగా నిలిచారు. ఇప్పుడు చంద్రబాబు అసలు లక్ష్యం జగన్ ను బీజేపి నుంచి బయటకు రప్పించడమే. అందుకే తరచూ ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖలు రాస్తున్నారు. టీడీపీ నేతలు తరచూ ఢిల్లీ వెళ్లి కేంద్రంలోని పెద్దలను కలుస్తున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ తనంతట తానే బీజేపీ స్నేహం నుంచి బయటకు వస్తుందన్నది చంద్రబాబు వ్యూహం.కానీ జగన్ మాత్రం చంద్రబాబు ట్రాప్ లో పడే అవకాశం కన్పించడం లేదు. తొలి నుంచి బీజేపీతో అంతే దూరాన్ని జగన్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు. అప్పుడప్పుడూ ఢిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీని శత్రువుగానే జగన్ చూస్తున్నారు. చంద్రబాబు ను నమ్మేందుకు బీజేపీ పెద్దలు సిద్ధంగా లేరన్నది జగన్ నమ్మకం. అందుకే టీడీపీ నేతలు ఎంత రెచ్చగొట్టినా నవ్వుతూనే బీజేపీతో మిత్రత్వం కొనసాగిస్తున్నారు.నిజానికి జగన్ కు, బీజేపీకి అసలు సంబంధమే లేదు. బయట నుంచి జగన్ బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబు మాదిరి కేంద్రంలో భాగస్వామ్యం కాలేదు. అందువల్ల జగన్ బీజేపీ నుంచి బయటపడే అనే ప్రశ్న ఉత్పన్నం కాదంటున్నారు. మరోవైపు బీజేపీ కూడా జగన్ ను నమ్ముకుంది. ఎంత కాదన్నా పది నుంచి పదిహేను స్థానాలను జగన్ దక్కించుకుంటారని, కాంగ్రెస్ ను ధ్వేషించే జగన్ తమకు మద్దతుదారుగానే ఉంటారని, చంద్రబాబులా అభిప్రాయాలను మార్చుకోరని బీజేపీ భావిస్తుంది. మొత్తం మీద చంద్రబాబు వైసీపీని ట్రాప్ చేయాలని చూస్తున్నారు.