YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కలకలం రేపుతున్న డేటా లీక్

కలకలం రేపుతున్న డేటా లీక్

తిరువనంతపురం, నవంబర్ 5
కేరళలో క్లాస్ సబ్-మెరైన్ డేటా లీక్ నేవీలో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారు అధికారులు. తాజాగా ఈ ఇష్యూలో మరో ఆరుగురిపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. దీంతో నేవీలో కలకలం రేపుతోంది సబ్-మెరైన్ డేటా లీక్ వ్యవహారం.భారత నావికాదళంలోని జలాంతర్గాములకు సంబంధించిన కీలక రహస్యాల లీక్‌ కేసులో ఆరుగురిపై ఛార్జిషీట్‌ దాఖలు చేసింది సీబీఐ. సర్వీసులో ఉన్న ఇద్దరు కమాండర్లు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. నావికా దళానికి చెందిన కిలో క్లాస్‌ జలాంతర్గములకు చెందిన సమాచారం బయట వ్యక్తులకు అందజేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ సబ్‌మెరైన్లలోని ఎంఆర్‌సీఎల్‌ ప్రోగ్రాం వివరాలను లీక్‌ చేసినట్లు వెల్లడించింది సీబీఐ. సర్వీసులో ఉన్న అధికారులు కీలక సమాచారాన్ని విశ్రాంత అధికారులకు అందజేశారు. ఆ విశ్రాంత అధికారులు దక్షిణ కొరియా కంపెనీ కోసం పనిచేస్తున్నారని అభియోగాలున్నాయి.భారత నావికాదళం సరికొత్త జలాంతర్గాములను నిర్మించే ప్రాజెక్టును చేపట్టింది. దీనిలో కాంట్రాక్టు కోసం దక్షిణ కొరియా కంపెనీ కూడా ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్‌ 3న విశ్రాంత నేవీ అధికారులు రణదీప్‌ సింగ్‌, ఎస్‌జే సింగ్‌లను అరెస్టు చేయడంతో అసలు విషయం బయటపడింది. వీరిలో కొమోడోర్‌ రణ్‌దీప్‌సింగ్‌ ఇంట్లో తనిఖీలు నిర్వహించి 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది దర్యాప్తు సంస్థ. ఆ తర్వాత నావికాదళ పశ్చిమ కమాండ్‌లోని కమాండర్‌ అజిత్‌ కుమార్‌ పాండేను అరెస్టు చేశారు అధికారులు. దాదాపు డజను మందికి ఈ కేసుతో సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నారు సీబీఐ ఆఫీసర్లు. ఇండియన్ నేవీ కూడా ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిందిఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వైస్ అడ్మిరల్, రేర్ అడ్మిరల్ స్థాయి అధికారుల నేతృత్వంలో విచారణకు ఆదేశించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని కమిటీని ఆదేశించినట్లు వెల్లడించాయి. త్రివిధ దళాలకు చెందిన అనేక మంది విశ్రాంత ఉద్యోగులపై దర్యాప్తు సంస్థలు నిఘా పెడుతున్నాయని తెలిపారు సంబంధిత అధికారులు. ఈ క్రమంలోనే తాజా అరెస్టులు జరిగాయని వెల్లడించారు. వీరి నుంచి అందిన సమాచారం ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని చెప్పారు ఆఫీసర్లు.

Related Posts