కరీంనగర్, నవంబర్ 5,
రెండేళ్లుగా కొవిడ్‌తో కుదేలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిరువ్యాపారులను సిలిండర్ ధర భయపెడుతున్నది..నెలనెలా పెరుగుతూ చుక్కలు చూపుతున్నది. సోమవారం ఏకంగా రూ.266 వడ్డించగా 19 కేజీల కమర్షియల్ గ్యాస్ రేటు రూ. 2210కు చేరింది..కాగా ధరల భారం మోపుతున్న కేంద్రం వైఖరిపై ఆగ్రహం పెల్లుబుక్కుతున్నదినెలనెలా పెరుగుతున్న వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు చిరు వ్యాపారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొంతకాలంగా కొవిడ్‌తో బిజినెస్ నడువక ఇబ్బందులు పడ్డ వారు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఈ తరుణంలో వాణిజ్య సిలిండర్ ధర పెంపు కలవరపాటుకు గురిచేస్తున్నది. మనదేశానికి చెందిన ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదలను సాకుగా చూపుతూ గ్యాస్ ధరను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి. ప్రభుత్వం విధించే పన్నులు కూడా ధరల పెరుగుదలపై ప్రభావాన్ని చూపుతాయి. అయితే గృహావసరాలకు వినియోగించే సిలిండర్ల ధరలను యథాతథంగా ఉంచడం కొంత ఊరటనిస్తోంది. తాజాగా చమురు సంస్థలు 19కిలోల వాణిజ్య వంట గ్యాస్ ధరను భారీగా పెంచాయి. ఒకేసారి ఏకంగా రూ.270 పెంచుతున్నట్లు ప్రకటించాయి. సవరించిన ధరలు సోమవారం నుంచే అమలులోకి వస్తాయని తెలిపాయి. కరీం‘నగరం’లో ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ ధర 1,940 ఉండగా, పెరిగిన ధర రూ.270తో రూ.2,210కు చేరింది. ఎల్పీజీ ధర పెంపుతో పాటు కేంద్రం గతేడాది నుంచి రాయితీని కూడా తొలగించింది. సాధారణంగా ఓ టీ స్టాల్‌లో నెలకు సగటునా నాలుగు వాణిజ్య సిలిండర్లు వినియో గిస్తుంటారు. ఈ లెక్కన ప్రస్తుతం పెరిగిన ధర ప్రకారం నెలకు రూ.1,080 వరకు అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది. దీంతో చిరువ్యాపారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అరకొర ఆదాయంతో ఊసురు మంటున్న తమను పెరిగిన బండ ధర మరింత కుంగదీసే పరిస్థితి నెలకొందని వారు ఆవేదన చెందుతున్నారు.టీ స్టాల్‌తో పాటు మిర్చీలు తయారు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న. పొద్దంతా కష్టపడితే వచ్చేది అంతంత మాత్రం సంపాదన. ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ ధర పెంచడం మాలాంటి వారికి ఇబ్బందికరమే. ఆదాయం పెరుగకుండా ఖర్చు ఇట్ల పెరుగుకుంటా పోతే మాకు కష్టం తప్ప మిగిలేది ఏముంటది.