YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరులో సందడిగా పులికాట్ ప్రాంతం

నెల్లూరులో సందడిగా పులికాట్ ప్రాంతం

నెల్లూరు, నవంబర్ 6,
పక్షుల విడిది కేంద్రం నేలపట్టు. జీవ వైవిధ్యానికి నెలవైన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు పులికాట్‌ విదేశీ వలస విహంగాల విహారంతో అరుదైన ప్రపంచంగా కనిపిస్తోంది. చెరువు నీటిలోని కడప చెట్లపై విడిది చేస్తున్న అతిథుల కిలకిలరావాలు, ఆహార వేటలో సాగించే విన్యాసాలు పక్షి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. దశాబ్దాలుగా నేలపట్టు విదేశీ పక్షుల సంతనోత్పత్తి కేంద్రంగా భాసిల్లుతోంది. అక్టోబరు మాసం వచ్చిందంటే.. రంగు రంగుల పక్షులు వచ్చి వాలుతుంటాయి. సుమారు ఆరు నెలల పాటు ఇక్కడ విడిది చేసి సంతానోత్పత్తిని పెంచుకుని తిరిగి స్వస్థలాలకు పయనమవుతాయి. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో నేలపట్టు చెరువులతో పాటు పులికాట్‌కు నీళ్లు రా వడంతో వలస పక్షులు నెల ముందుగానే చేరు కుని సందడి చేస్తున్నాయి. ఒక వైపు నేలపట్టు  చెరువులో విదేశీ వలస విహంగాలు గుడ్లుపెట్టి పొదుగుతుంటే పులికాట్‌ సరస్సులో విహంగాలు ఆహార వేట సాగిస్తూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. సూళ్లూరుపేట–శ్రీహరికోట రోడ్డులో పులికాట్‌ సరస్సులో నీళ్లు పుష్కలంగా చేరడంతో ఫ్లెమింగోలు, పెలికాన్స్, పెయింటెడ్‌ స్టార్క్స్‌ గుంపులు గుంపులుగా ఆహార వేటలో దర్శనమిస్తున్నాయి. సీగల్స్, చిలువలు, నీటికాకులు, నారాయణ పక్షులతో పాటు వివిధ రకాలకు చెందిన కొంగ జాతులు విపరీతంగా విడిది చేసి ఉన్నాయి.  నేలపట్టును సంతానోత్పత్తి కేంద్రంగా, పులికాట్‌ సరస్సును ఆహార కేంద్రంగా చేసుకుని పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.ప్రపంచంలోనే అందమైన పక్షి ఫ్లెమింగో. ఈ పక్షి హంసను పోలి ఉంటుంది. శాఖాహారి. ఈ రకం పక్షులు అత్యంత అరుదుగా ఉన్నాయి. పులికాట్‌ సరస్సు మీద ఆహార వేటలో గుంపులు గుంపులుగా చేరి పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తాయి.  ఈ పక్షులు ఆ్రస్టేలియా, రష్యా, సైబీరియా నుంచి వలస వచ్చి గుజరాత్‌లోని రాణాఫ్‌కచ్‌ అనే ప్రాంతంలో సంతానోత్పత్తి చేసుకుంటూ పులికాట్‌ సరస్సును ఆహార కేంద్రంగా ఉపయోగించుకుంటున్నాయి.  ఈ పక్షులు పులికాట్‌ సరస్సులో రోజుల తరబడి ఉంటాయని దీనిపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు చెప్పారు.  పులికాట్‌ సరస్సులో ఉండే నాచును మాత్రమే తింటుంది. ఈ పక్షి చెట్ల మీద గూళ్లు కట్టుకోకుండా నేలమీద రంధ్రం చేసుకుని గుడ్లు పెట్టి పొదుగుతాయి. హంసలు పాలను నీళ్లును వేరు చేసినట్టు ఈ పక్షి నాచు తినేటప్పుడు బురదను నాచును వేరు చేసి ఆహారంగా తీసుకోవడం దీని ప్రత్యేకత.ఆసియా ఖండంలోనే విదేశీ శీతాకాలపు వలస విహంగాల సంతానోత్పత్తి కేంద్రంగా, నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంగా భాసిల్లుతుంది. 1976లో నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రంగా వన్యప్రాణి విభాగం అధికారులు గుర్తించారు. ఈ కేంద్రం 458.92 హెక్టార్లలో విస్తరించి ఉంది. ప్రస్తుతం పక్షుల కేంద్రంలో 11 రకాల పక్షులు 4 వేలకు పైబడి విడిది చేశాయి. ఇందులో గూడబాతులు (పెలికాన్‌) 850, నత్తగుల్ల కొంగలు (ఓపెన్‌బిల్‌ స్టార్క్స్‌) 2015, తెల్లకంకణాయిలు (వైట్‌ఐబీస్‌) 600, తెడ్డుముక్కు కొంగలు (స్పూన్‌ బిల్స్‌) 100, నారాయణ పక్షులు (నైట్‌హేరాన్‌) 250, నీటికాకులు (కార్మోరెంట్స్‌)300, చిన్న,పెద్ద స్వాతికొంగలు150 (ఈ గ్రేడ్స్‌), వీటితో పాటు పదుల సంఖ్యలో పాముమెడ పక్షులు (డాటర్‌), చుక్కకోళ్లు (కూట్స్‌), ఊలబాతులు (లేజర్‌ విజిలింగ్‌ డక్స్‌) సందడి చేస్తున్నాయి.దొరవారిసత్రం, నేలపట్టులో గూడబాతులు, నత్తగుల్ల కొంగలు, నీటికాకులు, తెల్లకంకణాయిలు, శబరి కొంగలు వంటి పక్షులు కనిపిస్తున్నాయి. ఇక్కడకొచ్చే విదేశీ వలస పక్షుల్లో అతి అందమైన పక్షి ఫ్లెమింగో కావడంతో ఆ పక్షి పేరుతో ఏటా పండగను నిర్వహిస్తున్నారు. పులికాట్‌ సరస్సు, నేలపట్టులో కలిపి సుమారు 50 వేల విదేశీ వలస విహంగాలు ఇప్పటికే విచ్చేసినట్లు పులికాట్‌ వన్యప్రాణి సంరక్షణాధికారులు వెల్లడించారు. కుదిరి–అటకానితిప్ప గ్రామాల మధ్య సరస్సులో పర్యాటకులు విహంగాలను వీక్షించేందుకు రెండు, మూడు చోట్ల వ్యూ పాయింట్స్‌ ఏర్పాట్లు చేశారు.    

Related Posts