నెల్లూరు, నవంబర్ 6,
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సీఎం తర్వాత అన్నీ తానై వ్యవహరించిన మాజీమంత్రి పొంగూరు నారాయణ ఇప్పుడు బొత్తిగా కనిపించడం మానేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే నారాయణను తన కేబినెట్‌లోకి తీసుకుని కీలకమైన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను అప్పగించారు అధినేత చంద్రబాబు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి కమిటీకి చైర్మన్‌గా కూడా పగ్గాలు కట్టబెట్టారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాష్ట్రంలో చక్రం తిప్పారు నారాయణ. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. ఆ తర్వాత సొంత పార్టీకి దూరంగా ఉంటున్నారు. కనీసం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లోనూ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.నారాయణ వ్యవహారాన్ని గమనిస్తూ వస్తున్న అధినేత చంద్రబాబు కూడా నారాయణను పక్కన పెట్టారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అది నిజమనే అనిపిస్తోందని అంటున్నారు. ఇటీవల చంద్రబాబు ఏపీ టీడీపీ కొత్త కమిటీలను ప్రకటించారు. పార్టీ పొలిట్‌బ్యూరోలో కానీ, కేంద్ర కమిటీలో కానీ నారాయణకు చోటు కల్పించకపోవడం వెనుక వేరే కారణాలున్నాయని చెబుతున్నారు.నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు బీదా రవిచంద్రకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని పొలిట్‌బ్యూరో సభ్యులుగా నియమించారు. అబ్దుల్ అజీజ్‌కు నెల్లూరు పార్లమెంటరీ కమిటీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే నారాయణ పేరు మాత్రం ఏ కమిటీలోనూ కనిపించక పోవడం చర్చనీయాంశమైంది. దీంతో నారాయణ టీడీపీకి దూరమయ్యారా? లేక పార్టీ మారబోతున్నారా? అసలు నారాయణ పేరును కమిటీల్లో ప్రకటించక పోవడమేంటనే ప్రశ్నలు జిల్లా రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయినారాయణను పక్కన పెట్టడం వెనుక కారణాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒక పక్క రాష్ట్రంలో రాజధానుల రచ్చ, దేవాలయాలపై దాడులు, దళితులపై దాడులు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, రైతు సమస్యలు, కరోనా వంటి అనేక సమస్యలపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయాలు హాట్‌గా సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఎక్కడా నారాయణ స్పందించడం లేదు. విద్యా సంస్థలకే పరిమితమైపోయారు. పైగా కరోనా సమయంలో టీడీపీ తరఫున కాకుండా విద్యా సంస్థల పేరు మీదనే సేవలందించారు. ఈ కారణాలతో ఆయనను పార్టీయే పక్కన పెట్టిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.మరోవైపు నారాయణ పార్టీ మారబోతున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో ఆయన కీలకంగా ఉన్నారు. భూముల సేకరణలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని వైసీపీ ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే ఈ భూముల వ్యవహారం నారాయణ మెడకు చిక్కుకుందని చెబుతున్నారు. మరోపక్క సిట్ దర్యాప్తూ కొనసాగుతోంది. దీంతో ఆయన కేసుల నుంచి తప్పించుకోవడం కోసం, తన ఆస్తులను కాపాడుకొనేందుకు వైసీపీలో చేరుతున్నారనే టాక్ నడుస్తోంది. ఆయన చేరికపై నెల్లూరులోని ఓ ఎంపీ అధిష్టానంతో మంతనాలు జరిపారని, ఇక ఆయన ఫ్యాన్ గూటికి నారాయణ రావడమే తరువాయనే ప్రచారమూ సాగింది. దీంతో నారాయణ పార్టీని వీడడం ఖాయమని టీడీపీ వర్గాలు భావించాయి.ఈ నేపథ్యంలోనే నారాయణను అధినేత చంద్రబాబు పక్కన పెట్టారని, అందుకే ఏ కమిటీలోనూ ఆయనకు చోటు కల్పించ లేదని చెవులు కొరుక్కుంటున్నారు. అసలు నారాయణను చంద్రబాబు దూరం పెట్టారా? అందుకే కమిటీల్లో నారాయణ పేరును ప్రకటించ లేదా? అసలు నారాయణ వాస్తవంగానే వైసీపీలోకి వెళ్తారా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని ఆయన అనుచరులు అంటున్నారు.