YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కార్తీక మాసం విశిష్టత ఏమిటి? ఏం చేయాలి?

కార్తీక మాసం విశిష్టత ఏమిటి? ఏం చేయాలి?
సనాతన ధర్మంలో ఆయనములు రెండు. ఉత్తరాయణం.. దక్షిణాయణం. ఉత్తరాయణంలో మాఘ మాసానికి ఎంతటి ప్రాధాన్యం ఉందో.. దక్షిణాయణంలో కార్తీక మాసానికి అంతటి విశిష్టత ఉంది. ఈ పుణ్య మాసం హరిహరులకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతోంది. 
కార్తీక మాసంలో ఏం చేయాలి?
కార్తీక మాసంలో స్నానం, దానం, దీపారాధన, జపం, అభిషేకం చేయాలి. ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తర్వాత చేసే దానాలు, ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తోంది. దీపారాధన చేయడం వల్ల పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో ప్రదోషకాలమనందు చేసే శివారాధన అనంతకోటి పుణ్యఫలాల్ని ఇస్తాయి. ఈ మాసంలో నక్తం లేదా ఉపవాసం ఆచరించడం వల్ల ఆరోగ్యం, దైవచింతన పరంగా శుభాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. 
కార్తీకంలో వచ్చే ముఖ్యమైన పండుగలివే..
కార్తీక శుక్ల పాడ్యమి/బలి పాడ్యమి: ఈరోజు బలి చక్రవర్తిని స్మరించడం వల్ల కీర్తి, యశస్సు కలుగుతాయి.
కార్తీక శుద్ధ విదదియ/ భగినీహస్త భోజనం:
ఈరోజు ప్రజలు ‘భ్రాతృద్వితీయ’ పేరుతో భగినీ హస్తభోజనం (సోదరీమణుల ఇళ్లకు వెళ్ళి మృష్టాన్న భోజనం చేసి, వారికి కానుకలను సమర్పించడం) చేస్తారు. సోదరీమణుల ఇళ్లకు వెళ్లి వారి చేతి వంటను తిని తమ స్తోమతకు తగినట్టుగా వస్త్రాలు, తాంబూలం సమర్పించి వాళ్లను ఆనందింపజేస్తారు. ఆమె చేతి భోజనాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఆడపిల్లలకు సౌభాగ్యం, పురుషులకు ఆయురారోగ్య ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రవచనం. 
నాగుల చవితి: ఈరోజు నాగ దేవతను, సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఆరాధించిన వాళ్లకు కుజ దోషం, రాహుకేతు దోషం, కాలసర్ప దోషం తొలగుతాయి. మహిళలకు సౌభాగ్యం, పురుషులకు కుటుంబంనందు సౌఖ్యం కలుగును. 
కార్తీక శుక్ల ఏకాదశి: ఈరోజు శివారాధన చేయడం, మహా విష్ణువును పూజించడం, విశేషించి సత్యనారాయణ వ్రతం ఆచరించడం ఫలప్రదం.  ఈ ఏకాదశిని ప్రభోదని ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశితోనే చాతుర్మాస్య వ్రతములు పూర్తవుతాయి.
కార్తీక మాసంలో సత్యనారాయణస్వామి వ్రత ప్రాధాన్యం:
సత్యనారాయణ స్వామి వ్రత కథా విధానం ప్రకారం.. సత్యనారాయణ వ్రతం జీవితంలో ఎప్పుడైనా ఆచరించవచ్చు. కానీ.. వ్రత కథ ప్రకారం కొన్ని ముఖ్యమైన విశేష దినములు/స్వామికి ప్రీతికరమైన దినములుగా పేర్కొంటారు. అందులో ప్రతిమాసంలో వచ్చే ఏకాదశి/ద్వాదశి/ పౌర్ణమి తిథుల యందు, రవి సంక్రమణములు (సూర్యుడు ఒక రాశి నుంచి మరోరాశికి ప్రవేశించి పుణ్య సమయం), మాఘ, ఫాల్గుణ, శ్రావణ కార్తీక ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల యందు చేసేటువంటి సత్యనారాయణస్వామి పూజలు అత్యంత ఇష్టమైనటువంటివిగా వ్రతకల్పనలో పేర్కొనబడినది.
కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైనది క్షీరాబ్ది ద్వాదశి. మన సనాతన ధర్మంలో పంచభూతాలను దైవంగా భావించవలెను. అందులో అగ్నిని ఆరాధించడం, ప్రతిరోజూ దీపమును వెలిగించడం ప్రాధాన్యతగా చెప్పబడింది. ప్రతి మనిషి తన జీవితంలో రోజూ ఆలయంలో, ఇంటి వద్ద దీపం వెలిగించి దీపారాధన చేయవలెను. కలియుగంలో ఇలా నిత్యం చేయలేని స్థితి ఏర్పడినప్పుడు కార్తీక శుక్ల ద్వాదశి రోజు (క్షీరాబ్ది ద్వాదశి) దీపారాధన చేస్తే వారికి ఏడాదంతా దీపారాధన చేసినంత పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం పేర్కొంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసికోట వద్ద ఉసిరి కొమ్మ ఉంచాలి. తులసికోటను లక్ష్మీ స్వరూపంగా, ఉసిరిని మహా విష్ణువుగా భావించి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఆచరించవలెను. పూర్వం దేవతలు పాలకడలిని చిలికిన రోజు అయినందున ఈరోజును చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు.
కార్తీక పౌర్ణమి: కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో ఈశ్వరుడిని అభిషేకం చేసుకొని శివారాధన చేసి జ్వాలా తోరణంను దర్శించవలెను. ఈ పుణ్య మాసంలో కార్తీక సోమవారాలు అత్యంత పవిత్రమైనవిగా శివపురాణం చెబుతోంది. సోమవారాల రోజు శివారాధన చేయడం, ఈశ్వరుడిని పంచామృతాలతో అభిషేకించడం, ఉపవాసం వంటివి ఆచరించడం, నదీస్నానం ఆచరించి దీపారాధన చేయడం వల్ల హరిహరుల అనుగ్రహం కలుగుతుందని కార్తీక పురాణం స్పష్టంగా చెబుతోంది. 
ఈ మాసంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఆయుస్సు, ఆరోగ్యం కలిగి కష్టాలు తొలగుతాయి. ????ఆవు నెయ్యితో దీపారాధన చేయడం లక్ష్మీప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి.

Related Posts