లక్నో, నవంబర్ 5
ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి… మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న ప్రణాళికలతో ముందుకు కదులుతోంది బీజేపీ.. ఇదే సమయంలో.. ఓ వైపు ప్రియాంక నేతృత్వంలో కాంగ్రెస్, మరోవైపు అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో ఎస్పీ, మాయావతి నేతృత్వంలో బీఎస్పీ.. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.. ఇక, సీఎం యోగి ఆదిత్యానాథే మరోసారి సీఎం అవుతారనే ప్రచారం కూడా ఉంది.. అంతేకాదు.. మోడీ తర్వాత అంతటి చరిష్మా ఉన్న యోగీయే నంటూ కొంతకాలం ప్రచారం సాగింది.. కానీ, శుక్రవారం రోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం యోగి..2022 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశంపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.. ఇక, ఆ తర్వాతే ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటించారు. పార్టీ నిర్ణయం తర్వాతే తాను ఏ స్థానం నుంచి పోటీ చేసే విషయంపై స్పష్టత వస్తుందన్న యోగి ఆదిత్యానాథ్.. ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనేది బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని తెలిపిన ఆయన.. రాష్ట్రంలో పరిస్థితి శాంతియుతంగా ఉందని.. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందిస్తున్నామని వెల్లడించారు.