నెల్లూరు, నవంబర్ 8,
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. మంత్రి వర్గ విస్తరణ సమయం దగ్గరపడుతున్న కొద్దీ వీరిలో గ్యాప్ మరింత పెరుగుతుంది. రెండు వర్గాలుగా విడిపోయారు. మంత్రుల పనితీరును వీరు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పనులపై వైసీపీ ఎమ్మెల్యేలే మంత్రులను నిలదీస్తున్నారు. తమకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ కొందరు ఎమ్మెల్యేలు నేరుగానే విమర్శలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఇది ఇబ్బందికర పరిణామమే.నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అందరూ సీనియర్ నేతలే. అధిక భాగం రెడ్డి సామాజికవర్గం నేతలే. వీరంతా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. వీరిలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకవర్గంగానూ, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి మరొక వర్గంగా కన్పిస్తుంది. త్వరలో జరగబోయే మంత్రి వర్గం విస్తరణలో వీరంతా ఆశలు పెట్టుకున్నారు.మరో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మాత్రం అందరిని కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో మరోసారి వైసీపీ ఎమ్మెల్యేలను తమ గొంతును పెంచారు. ఆనం రామనారాయణరెడ్డి బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని అధికారులను నిలదీశారు. ఇళ్లస్థలాలను చదును చేసి అభివృద్ధి చేసినా ఇంతవరకూ బిల్లులు చెల్లించలేదని, ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లెవరూ ముందుకు రావడం లేదని ఆనం రామనారాయణరెడ్డి ఫైరయ్యారు.గత కొంతకాలంగా ఆనం రామనారాయణరెడ్డి అధికారుల తీరుపై అసంతృప్తితో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా అధికారులు మంత్రుల మాటకే విలువనిస్తున్నారని ఆయన అనేకసార్లు ఇదివరకే ఆరోపించారు. ఇదే సమావేశంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సయితం అధికారుల తీరుపై ఫైర్ అవ్వడం విశేషం. పట్టాలు ఇచ్చినా లే అవట్ ఎత్తు పెంచకపోవడంతో ఇబ్బందికరంగా మారిందని, నాలుగుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన ఆరోపించారు. ఇలా నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోయారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.