హైదరాబాద్, నవంబర్ 8,
రాష్ట్రంలో లిక్కర్ సేల్స్తో జనం నుంచి ప్రతి ఏడాది వేల కోట్లు రాబడుతున్న ప్రభుత్వం.. ఖజానాను మరింత నింపుకునేందుకు ప్లాన్ చేసింది. మద్యం వినియోగదారుల నుంచి వీలైనంత ఎక్కువ డబ్బులు గుంజేందుకు సిద్ధమైంది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా159 బార్లకు పర్మిషన్ ఇవ్వగా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా మరిన్ని వైన్ షాపులను తీసుకొస్తోంది. కొత్తగా 404 వైన్స్‌కు పర్మిషన్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం వైన్స్ సంఖ్య 2,620కి చేరనుంది. కొత్త మండలాలతో పాటు మరికొన్ని చోట్ల మద్యం దుకాణాలు తీసుకురానున్నారు. రాష్ట్రంలో ప్రతి రెండేండ్లకోసారి ఎక్సైజ్ పాలసీ మారుతుంటుంది. ఈ ఏడాది అక్టోబర్ నెలతో పాలసీ ముగిసినా దీన్ని ఈ ఏడాది నవంబర్ ఆఖరు వరకు పొడిగించారు.డిసెంబర్ ఒకటి నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో శనివారం పాలసీకి సంబంధించి నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. వైన్స్ కేటాయింపు ప్రాసెస్కు వచ్చే వారం తేదీలతో కూడిన నోటిఫికేషన్ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ నెల 9 నుంచి అప్లికేషన్ల స్వీకరణ, 16 వరకు దరఖాస్తులకు గడువు, 18న డ్రా తీయనున్నట్టు సమాచారం. వైన్స్‌లను డ్రా పద్ధతిలో కేటాయించనున్నారు. గతంలో మాదిరిగానే ఒక్కో అప్లికేషన్‌కు రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఇది నాన్ రిఫండబుల్. 2019లో మొత్తంగా 48 వేల ఆప్లికేషన్లతో రూ.976 కోట్ల ఇన్‌కం వచ్చింది. ఇప్పుడు అదనంగా మరో 404 వైన్సులు పెరగనుండటంతో రూ.1,200 కోట్లు అప్లికేషన్ల ద్వారానే వస్తుందని అంచనా వేస్తున్నారు. గతంలో ఒక్క వ్యక్తి ఒకటే దరఖాస్తు వేసుకునే చాన్స్ ఉండేది. ఈసారి రూల్స్మార్చి ఎన్ని అప్లికేషన్లనైనా వేసేందుకు వెసులుబాటు కల్పించారు. ఈ ఏడాది పాలసీలో భాగంగా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వాక్ ఇన్ స్టోర్స్‌లో లిక్కర్, బీర్ల అనుబంధ యాక్సెసరీస్ అయిన పెగ్ మేకర్, వాటిర్ బాటిల్స్, ఐస్ క్యూబ్స్, ఐస్ క్యూబ్ బకెట్స్, సోడా, సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్యూబ్ టాంగ్స్, ఓపెనర్స్ కూడా దొరకనున్నాయి. ఇప్పటి వరకు ఇలాంటివి నిషేధించారు. అనేక సందర్భాల్లో కేసులూ పెట్టారు. వాకిన్ స్టోర్స్ కోసం వైన్స్ ఎక్సైజ్ ట్యాక్స్కన్నా 5 లక్షలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ. 50 లక్షలు, 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతంలో రూ.55 లక్షలుగా ఎక్సైజ్ ట్యాక్స్ నిర్ణయించారు. అలాగే 50 వేల నుంచి లక్ష జనాభా ప్రాంతాల్లో రూ.60 లక్షలు , లక్ష జనాభా నుంచి 5 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ. 65 లక్షలు, 5 లక్ష నుంచి 20 లక్షల లోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.1 కోట్లుగా ట్యాక్స్ నిర్ణయించారు. ప్రస్తుతం కూడా ఇవే స్లాబులు కొనసాగుతున్నాయి. యాన్వల్ ఎక్సైజ్ ట్యాక్స్ నాలుగు వాయిదాల్లో చెల్లిస్తుండగా ఆరు వాయిదాలకు పెంచనున్నారు. అలాగే ఇప్పటి దాకా టర్నోవర్ ఏడు రెట్లు దాటితే 6.4 శాతం మార్జిన్ మాత్రమే వచ్చేది. కొత్త పాలసీలో 10 శాతానికి పెంచనున్నారు.కొత్త ఎక్సైజ్ పాలసీ నుంచి వైన్స్ కేటాయింపుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం అక్టోబర్ 20న ఉత్తర్వులు జారీ చేశారు. గౌడ్స్‌కు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు కల్పించనున్నారు. జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్లు ఉండనున్నాయి. కొత్త వైన్స్‌తో కలిపి 2,620 దుకాణాలు ఉండగా ఇందులో గౌడ్స్‌కు 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున కేటాయించాలని నిర్ణయించారు. అయితే ఏ జిల్లాలో ఎక్కడ.. ఏ షాప్ రిజర్వేషన్ కిందికి వస్తుందోతెలియాల్సి ఉంది. రిజర్వేషన్ స్థానాల్లో ఆ కేటగిరీ వాళ్లే అప్లికేషన్లు వేయాల్సి ఉంటుంది.