విశాఖపట్నం
డుంబ్రిగుడ మండలంలోని గసభ పంచాయతీ జంగిడి వలస గ్రామంలోని జిపిఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిని నియమించడంలో నిర్లక్ష్యం చేస్తున్న స్థానిక మండల ఎం ఈ ఓ భారతి రత్న పై చర్యలు తీసుకోవాలని స్థానిక సిపిఎం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎస్ బి పోతురాజు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిని నియమించక పోవడంతో సుమారు గత రెండేళ్ల నుంచి పాఠశాల మూతబడిందన్నారు. దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు విద్యకు దూరమయ్యారని చెప్పారు. పాఠశాలలో ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టాగా వెంటనే డేప్యుటేషన్ పై ఉపాధ్యాయుడిని నియమించాలని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ ఆదేశించారాన్నారు. అయితే పీవో ఆదేశాలిచ్చి సుమారు వారం రోజులు గడిచినా ఇప్పటికీ స్థానిక ఎంఈవో ఉపాధ్యాయుడిని నియమించ కపోవడం సరికాదన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ గ్రామంలోనీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు డ్రాపౌట్ అయ్యి తమ భవిష్యత్తును పోగొట్టుకుంటున్నారన్నారు. తక్షణమే జంగిడి వలసలో ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు .లేనిపక్షంలో పాడేరు ఐటీడీఏను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి సూర్యనారాయణ, ఆ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.