హైదరాబాద్, నవంబర్ 8,
హైదరాబాద్ పాతబస్తీలో ఇల్లు చూపిస్తానని కారులో తీసుకెళ్లిన ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోకి తీసుకెళ్లి రివాల్వర్, కత్తితో బెదిరించి దారుణానికి ఒడిగట్టారని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు ఒక్కో సారి ఒక్కో విధంగా పొంతన లేని సమాధానాలు ఇస్తుండటంలో పోలీసులకు కేసు విచారణ కష్టంగా మారింది. చివరకు అసలు అత్యాచారం జరగలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. డబ్బులు ఇవ్వకపోవడంతోనే తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసినట్లు మహిళ ఒప్పుకుంది. భరోసా సెంటర్లో ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు.గోల్కొండ చోటా బజార్‌కు చెందిన గృహిణి (33) భర్తకు విడాకులు ఇచ్చి తన ఇద్దరి పిల్లలతో కలిసి ఒంటరిగా నివసిస్తోంది. ఆమె పోలీసులకు తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేశారు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మరో ఇద్దరితో కలిసి నెల రోజుల క్రితం తన ఇంటికి వచ్చారని చెప్పింది. మంచి అద్దె ఇల్లు చూపిస్తానంటూ తనను కారులో షాహిన్ నగర్‌కు తీసుకెళ్లారని పేర్కొంది. అక్కడ లోనికి వెళ్లగానే వెంట తెచ్చుకున్న రివాల్వర్, చాకుతో చంపేస్తానని బెదిరించి వివస్త్రను చేశారని తెలిపింది. చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేశారని, నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీశారని చెప్పింది. ఆ తర్వాత అత్యంత పాశవికంగా ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారని వివరించింది. విషయాన్ని ఎవరికైన చెబితే నగ్న ఫొటోలు బయట పెడతామని, చంపేస్తామని బెదిరించారని పేర్కొంది.మహిళ ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన గోల్కొండ పోలీసులు బాధితురాలు స్టేట్ మెంట్ రికార్డు కోసం వెళ్లారు. అసలు ఏం జరిగింది వివరంగా చెప్పాలని బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డు నమోదు చేయసాగారు. ‘‘నేను ఇచ్చిన ఫిర్యాదు అంతా అబద్ధం, తన అవసరాలకు డబ్బులు ఇస్తూ వస్తున్న యువకుడు ఈ మధ్యకాలంలో డబ్బులు ఇవ్వడం మానేయడంతో ఈ రేప్ కథ అల్లానంటూ’’ పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది.