శ్రీకాకుళం, నవంబర్ 9,
తెలుగుదేశం పార్టీ ఈసారి టిక్కెట్ల కేటాయింపులో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. సామాజిక సమీకరణాలే కాకుండా గెలుపు లక్ష్యంగానే టిక్కెట్ల కేటాయింపు ఉండనుంది. ఈ నేపథ్యంలో ఈసారి చంద్రబాబు కొందరు సీనియర్ నేతలకు చెక్ పెట్టనున్నారు. సీనియర్ నేతలకు గాని వారి వారసులకుగాని వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంచాలని నిర్ణయించారు. ఇప్పుడు పార్టీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. టిక్కెట్లు దక్కనీ సీనియర్లలో కళా వెంకట్రావు ముందు వరసలో ఉంటారంటున్నారు.ఎచ్చెర్ల నియజకవర్గంలో కళా వెంకట్రావు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన సీనియర్ నేతగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు సొంత పార్టీలోనే వ్యతిరేకత తీవ్రంగా ఉంది. నాన్ లోకల్ ముద్రను ఆయన కుటుంబం మూటకట్టుకుంది. టీడీపీలోని అనేక మంది నేతలు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తుండమే కాకుండా మళ్లీ టిక్కెట్ ఇస్తే తాము సహకరించబోమని హెచ్చరిస్తున్నారు.కళా వెంకట్రావు ఎచ్చర్ల నియోజకవర్గానికి నాన్ లోకల్. అయినా కళా వెంకట్రావు ఎచ్చర్ల నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తన కుమారుడిని ఈసారి పోటీలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు. కానీ స్థానిక నాయకులు దీనికి అంగీకరించడం లేదు. అక్కడ బలంగా ఉన్న మరో టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడు కళాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనను పార్టీ నుంచి రెండుసార్లు సస్పెండ్ చేసినా పార్టీలోనే మరో వర్గంగా మసలుతున్నారు.దీంతో చంద్రబాబు ఈసారి ఎచ్చర్లకు కొత్తనేతను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. అధికారంలోకి వస్తే కళా వెంకట్రావుకు ఎమ్మెల్సీయో, రాజ్యసభ పదవో ఇస్తామని హామీ ఇచ్చి ఆయన కుటుంబాన్ని పోటీకి దూరం చేయనున్నారు. ఈసారి ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడం, ప్రతి సీటూ కీలకం కావడంతో చంద్రబాబు సీనియర్ నేతలయినా ఎన్నికలకు దూరంగా ఉంచి, వారి సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. మొత్తం మీద కళా వెంకట్రావు కుటుంబానికి ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబు ఝలక్ ఇచ్చే అవకాశాలున్నాయి.