హైదరాబాద్, నవంబర్ 9,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రి వర్గాన్ని విస్తరించడానికి సిద్ధమయ్యారు. హజూరాబాద్ ఉప ఎన్నిక కూడా పూర్తి కావడంతో ఆయన మంత్రివర్గ విస్తరణపై దృష్టిపెట్టారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే విస్తరణను కేసీఆర్ చేపట్టారు. తొలివిడతలో తక్కువ మందిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. తర్వాత విస్తరణలో కేటీఆర్, హరీశ్ రావు తో పాటు మరికొందరికి కేసీఆర్ కేబినెట్ లో అవకాశం కల్పించారు.తెలంగాణలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. దీంతో ఎన్నికల కేబినెట్ ను రూపొందించే పనిలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో చాలా మందికి ఉద్వాసన చెప్పి వారికి పార్టీ బాధ్యతలను అప్పగించాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది. దీంతో పాటు కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలొచ్చాయి. వీరిని కూడా మంత్రి వర్గం నుంచి తొలగించి కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు.దీంతో పాటు ఈటల రాజేందర్ ను తప్పించడంతో ఆ శాఖ బాధ్యతను కేసీఆర్ చూస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణలో వైద్య ఆరోగ్యశాఖను కొత్త వారికి అప్పగించనున్నారు. ఇక సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు కొన్ని జిల్లాల్లో కీలక నేతలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముంది. అంతేకాకుండా కొత్త పార్టీలు పుట్టుక రావడంతో సామాజిక వర్గాల సమీకరణలను కూడా కేసీఆర్ పరిగణనలోకి తీసుకోనున్నారు.ముఖ్యంగా ఎమ్మెల్సీ పదవుల భర్తీ కూడా త్వరలో కానుంది. ఈ నేపథ్యంలో కొందరు సీనియర్ నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి వారిని కేబినెట్ లోకి కేసీఆర్ తీసుకుంటారన్న టాక్ పార్టీలో నడుస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, మధుసూదనా చారి, మండవ వెంకటేశ్వరరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి వారి పేర్లు విన్పిస్తున్నాయి. వీరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆ జిల్లా మంత్రులను తప్పించడం ఖాయమంటున్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పోరాటం చేస్తానని, భయపడబోనని కేసీఆర్ తెలిపారు. బీజేపీ నేతలు తనను ఏమీ చేయలేరని, ఎటువంటి విచారణకైనా సిద్ధమని కేసీఆర్ తెలిపారు. ఈరోజు కూడా కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో పండించే ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని కేసీఆర్ తెలిపారు. వచ్చే శుక్రవారం అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నట్లు కేసీఆర్ చెప్పారు.తనది ఫామ్ హౌస్ కాదని, ఫార్మర్ హౌస్ అని కేసీఆర్ తెలిపారు. ప్రశ్నించిన వాళ్లంతా దేశ ద్రోహులు ఎలా అవుతారని ఆయన అన్నారు. బీజేపీ నేతలను వదిలిపెట్టబోమని కేసీఆర్ తెలిపారు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. తమకు బాస్ తెలంగాణ ప్రజలే కాని, మరెవరూ కాదన్నారు. బండి సంజయ్ సొల్లు పురాణం చెప్పడం మానుకోవాలని కేసీఆర్ హితవు పలికారు. ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. తెలంగాణలో పండే ప్రతి గింజా కొనాల్సిందేనని కేసీఆర్ డిమాండ్ చేశారు.