ముంబై, నవంబర్ 10,
కొత్త క్రెడిట్ కార్డులతోపాటు వాడకమూ ప్రతినెలా పెరుగుతూనే ఉంది. కార్డుల ద్వారా చేసే ట్రాన్సాక్షన్ల డబ్బును తిరిగి చెల్లించడానికి 45 రోజుల వరకు గడువు ఉంటుంది కాబట్టి వీటికి డిమాండ్ ఎక్కువ అవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో క్రెడిట్ కార్డ్ ఖర్చులు సీక్వెన్షియల్‌గా 34 శాతం పెరిగాయి. ఫెస్టివల్ సీజన్ కావడంతో అక్టోబర్, నవంబర్ మొదటి వారం ట్రెండ్‌లు చాలా బలంగా ఉన్నాయని ఎనలిస్టులు తెలిపారు. ఈ విషయమై ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మాట్లాడుతూ.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.80,200 కోట్లను కార్డుల ద్వారా ఖర్చు చేశారని వెల్లడించారు. ‘ క్రెడిట్ కార్డ్ టు డెబిట్ కార్డ్’ ఖర్చు రేషియో ఇప్పుడు 1.28 రెట్లు ఉంది. ఇది 2019 ఏప్రిల్ నుండి ఇదే అత్యధికం.
అక్టోబరులో ఈ రేషియో 15-–18శాతం ఎక్కువ ఉండొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు.ఈ సంవత్సరం రెండో క్వార్టర్ లెక్కలను గమనిస్తే ఎస్‌బీఐ కార్డ్స్ రిసీవబుల్స్ తొమ్మిది శాతం పెరిగాయి. బిల్స్ మొత్తంలో ఇది 31 శాతం. అంటే చెల్లింపులు తక్కువగానే ఉన్నాయి. ఇది ఇండస్ట్రీ డేటాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏప్రిల్– జూన్ మధ్య పరిశ్రమ ఖర్చులు 6.3శాతం పెరిగాయి. రిసీవబుల్స్ మాత్రం 10శాతం తగ్గాయి ”అని స్టేట్ బ్యాంక్ కార్డ్స్ రిపోర్టు సోమవారం తెలిపింది. ఇదే ఏడాది జూన్– సెప్టెంబర్ మధ్య ఇండస్ట్రీ స్పెండింగ్‌లో 28 శాతం పెరుగుదల కనిపించింది. రిసీవబుల్స్ (రాబడులు) 12.5 శాతంపెరిగాయి. చాలా మంది తమ ట్రాన్సాక్షన్లను నెలవారీ కిస్తీలుగా మార్చుకుంటారు కాబట్టి రిసీవబుల్స్ ఇంకా ఎక్కువ ఉండొచ్చని పేర్కొంది. మనదేశంలో ప్రస్తుతం 6.5 కోట్ల కార్డులు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే 11శాతం, నెలవారీగా 2శాతం వీటి సంఖ్య పెరిగింది . స్టేట్ బ్యాంక్ కార్డ్ మార్కెట్ వాటా ఆగస్టులో 19.40 శాతం కాగా, సెప్టెంబర్‌లో 19.35శాతానికి తగ్గింది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ వాటా ఎప్పటిలాగే 23 శాతం ఉందని కంపెనీ తెలిపింది. “క్రెడిట్ కార్డుల బకాయిల విలువ ప్రస్తుతం రూ.1.1 లక్షల కోట్ల వరకు ఉంది. నెలవారీ ఖర్చులు మూడు శాతం పెరిగినా, బకాయిల్లో రెండు శాతం పెరుగుదల ఉంది. నెలవారీగా చూస్తే ఒక్కో కార్డు బకాయిల సగటు రిసీవబుల్ రెండు శాతం తగ్గింది’’ అని ఎస్‌బీఐ కార్డ్స్ తెలిపింది.