విశాఖ నగరానికి తాగు నీటిని అందిస్తున్న జలాశయాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు కొంతమేర నీటిమట్టాలు పెరిగాయి. కొన్ని జలాశయాల నీటి మట్టాల్లో పెద్దగా మార్పులు లేవు. గోదావరి నీటి మట్టం 2 మీటర్లు మేర పెరిగింది. ప్రధానంగా జివిఎంసికి తాగునీటిని అందిస్తున్న ఏలేరు కెనాల్‌కు నీటిని ప్రస్తుతం గోదావరి నుంచి లిప్ట్ ద్వారా పంప్ చేస్తున్నారు. అక్కడ రెండు మీటర్ల మేర నీటి మట్టం పెరగడం కొంత మేర ఉపశమనం కలిగింది. రైవాడలో 0.7 మీటర్లు, మేఘాద్రి గెడ్డలో 0.2 అడుగులు, తాటిపూడిలోనూ 0.4 అడుగులు మేర నీటి మట్టాలు పెరిగాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలోనే మార్చి నెలాఖరు నుండే తాగునీటికి ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో సరఫరా చేసే సమయాన్ని కుదించారు. కొండవాలు ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గింది. ట్యాంకర్లతో నీటని అందిస్తున్నారు. భూగర్భ నీటి మట్టాలు కూడా పడిపోయాయి. శివారు ప్రాంతాలు, నగరంలోనూ నీటి సరఫరా తగ్గిన ప్రాంతాల్లోనూ బోర్లు వాడేవారు. నీటి మట్టాలు పడిపోయి అవి కూడా సక్రమంగా పని చేయలేదు. అయితే ఈ నెల 1 న విశాఖలో 7, 3న 9 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలో భూగర్భ నీటి మట్టాలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. శివాజీపాలెంలో ఏప్రిల్‌లో 16.50 మీటర్ల నీటి మట్టం ఉండగా ప్రస్తుతం 14.53 మీటర్ల స్థాయికి పెరిగింది. వైఎస్‌ఆర్ పార్కు వద్ద గతంలో 16.81 మీటర్లు ఉంటే ప్రస్తుతం 14.68 మీటర్లకు నీటి మట్టం ఎగబాకింది. విశాఖ ఏజెన్సీ, అరకు, అనంతగిరి కొండల్లోనూ, ఏలేరు కెనాల్ బేసిన్, గోదావరి బేసిన్‌లోనూ వర్షాలు పడటంతో నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.