హైదరాబాద్
ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌కు వైద్యారోగ్య శాఖను కేటాయించారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై గవర్నర్ తమిళి సై సంతకం చేశారు. కాసేపట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. కాగా హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి తరపున మంత్రి హరీశ్ రావు ప్రచారం చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపుకోసం నియోజకవర్గం మొత్తం ప్రచారం చేశారు. అయినా ఈటల రాజేందర్ గెలుపొందారు. టీఆర్ఎస్‌లో ఈటల రాజేందర్ ఉన్నప్పుడు వైద్యారోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. పార్టీలో జరిగిన పరిణామాలతో ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరి ఉపఎన్నికలో పోటీ చేశారు. ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీఆర్ఎస్‌లో హరీశ్ రావు పరిస్థితి కూడా తన లాగే ఉంటుందని ఈటల రాజేందర్ ఉప ఎన్నికలో ప్రచారం చేశారు. అయితే ఈటల ప్రచారాన్ని సీఎం కేసీఆర్ తిప్పికొట్టారు. మంత్రి హరీశ్ రావుకు వైద్యారోగ్య శాఖను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.