విశాఖపట్టణం, నవంబర్ 11,
గంటా శ్రీనివాసరావు. పేరు ఎక్కడో విన్నట్టుంది కదా? విశాఖ నార్త్ ఎమ్మెల్యే. మాజీ కాదు సిట్టింగ్ ఎమ్మెల్యేనే. ఏ పార్టీ అని మాత్రం అడగొద్దు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలీదు. గెలిచింది మాత్రం సైకిల్ గుర్తుపై. టెక్నికల్‌గా ప్రస్తుతం ఆయన టీడీపీ ఎమ్మెల్యేగానే ఉన్నారు కానీ, టీడీపీతో మాత్రం లేరు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడుతానంటూ పెద్ద పోటుగాడిలా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ముందు రాంగ్ ఫార్మాట్‌లో రిజైన్ చేస్తే.. విమర్శలతో గంటాను కుళ్లబొడిచారంతా. ఇక తప్పేలా లేదంటూ.. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతే. రాజీనామా చేసి నెలలు గడుస్తున్నా.. ఆ రాజీనామా అడ్రస్ లేకుండా పోయింది. స్పీకర్ ఆమోదించడం లేదు.. ఈయన ఆయనపై ఒత్తిడి పెంచడం లేదు. అంతా అడ్జస్ట్‌మెంట్‌లా అనిపిస్తోంది. సరే.. ఆ విషయం పక్కనపెడదాం.విశాఖ ఉక్కు కోసం నేను సైతమంటూ అప్పట్లో గంటా కాస్త హడావుడి చేసేందుకు ట్రై చేసినా.. ఆయనెవరూ పెద్దగా పట్టించుకోలేదు. రాజీ..నామా మినహా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శ్రీనివాసరావు చేసిందేమీ లేదు. ఓ వైపు కార్మికులు విశాఖ ఉక్కు కోసం అలుపెరగకుండా పోరాడుతున్నారు. వారికి గంటా నుంచి ఎలాంటి మద్దతూ లేదు. ఇటు అధికార పక్షం.. అటు ప్రతిపక్షం.. పార్టీలన్నీ ప్రైవేటీకరణను నిరసిస్తున్నాయి. ఈయన మాత్రం నీరసించిపోయినట్టున్నారు. ఇటీవల జనసేనాని విశాఖలో సభ పెట్టి దుమ్మురేపారు. మరి, స్థానిక నాయకుడైన గంటా శ్రీనివాసరావు తనవంతుగా ఏం చేశారు? టీడీపీ శ్రేణులు స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల తీరును నిత్యం ఎండగడుతున్నాయి. కనీసం తన పార్టీ తరఫున పోరాటాల్లోనూ గంటా పార్టిసిపేట్ చేయడం లేదు. ఆయన ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో.. ఎవరికీ తెలీదు. అంటే.. విశాఖ ఉక్కు కోసం రాజీనామా.. డ్రామా అనేగా అర్థం?పవర్, పరపతి లేకుండా గంటా శ్రీనివాసరావు ఉండలేరని అంటారు. ఆయన వ్యాపార సామ్రాజ్యానికి అధికారమే అండ. రాజకీయాల్లో గోడ మీద పిల్లి ఎవరంటే.. గంటానే ముందుగా గుర్తుకొస్తారని చెబుతారు. టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత పీఆర్పీలో చేరి చిరంజీవి పంచన చేరారు. పీఆర్పీని కాంగ్రెస్‌లో కలిపేశాక.. గంటాకు మంత్రి పదవి వరించింది. ఆ తర్వాత కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చేసి మళ్లీ టీడీపీలో చేరారు. 2014లో భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి.. చంద్రబాబు కేబినెట్‌లో ఓ వెలుగు వెలిగారు. 2019లో విశాఖ నార్త్ నుంచి గెలిచినా.. టీడీపీ అధికారం కోల్పోవడంతో పార్టీతో అంటీముట్టనట్టు మెదులుతున్నారు. గత టర్మ్‌లో.. నారాయణ-గంటా శ్రీనివాసరావు.. వియ్యంకులు ఇద్దరూ ప్రభుత్వంలో ఫుల్ హవా కొనసాగించి.. పవర్ పోగానే.. వాళ్లిద్దరూ అడ్రస్ లేకుండా పోయారు. టీడీపీకి తామేమీ కాదన్నట్టు.. టచ్ మీ నాట్‌లా వ్యవహరిస్తుండటంపై తెలుగు తమ్ముళ్లు గుర్రుమంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరాలని తెగ ప్రయత్నిస్తున్నారని టాక్. కానీ, స్థానిక వైసీపీ నేతలు గంటాకు ఛాన్స్ ఇవ్వడం లేదట. 2019లో ఎమ్మెల్యేగా గెలిచినా.. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా చంద్రబాబును కలవలేదు ఆయన.