విజయవాడ, నవంబర్ 11,
ఏపీ అప్పుల రాష్ట్రం. దివాళ అంచున చేరిన రాష్ట్రం. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలివ్వడమే కష్టం. నవరత్నాలకు నిధులు లేక.. అమ్మ ఒడిని అటకెక్కించే ప్రయత్నం. కార్పొరేషన్ల పేరున రుణాలు తీసుకొని.. పక్కదారి పట్టించే స్కీం. ఏపీ అప్పులు చూసి.. కొత్తగా అప్పులిచ్చేందుకు జంకుతున్నాయి పలు ఆర్థిక సంస్థలు. దీంతో.. ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్లు వేలం వేస్తూ నెట్టుకొస్తోంది జగన్ సర్కారు. ఆ బాండ్లు కూడా కొనేవారు కరువవడంతో.. భారీ వడ్డీ ఆశగా చూపించి.. తాజాగా మరో వెయ్యి కోట్ల అప్పు చేసింది ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుంచి మరో వెయ్యి కోట్ల రుణాన్ని సేకరించింది. ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వెయ్యి కోట్లు పొందింది. వేలంలో 5 రాష్ట్రాలు పాల్గొనగా.. ఏపీ ప్రభుత్వం అత్యధిక వడ్డీ 7 శాతం చెల్లించి మరీ ఈ రుణాన్ని సొంతం చేసుకుంది. 17 ఏళ్లకు 500 కోట్లు, 18 ఏళ్లకు మరో 500 కోట్లు రుణాన్ని సమీకరించింది. దీంతో కేంద్రం ఇచ్చిన అదనపు రుణ పరిమితిలో ఏపీకి 150 కోట్లు మాత్రమే మిగిలాయి. అయితే మళ్లీ అదనపు రుణ పరిమితి కోసం కేంద్రం వద్ద ఆర్ధిక శాఖ అధికారులు పడిగాపులు కాస్తున్నారు. అదనపు రుణపరిమితి ఇవ్వకపోతే రాష్ట్రం మరింతగా ఆర్ధిక కష్టాలు ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మెడపై పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిఫాల్టర్ కత్తి వేలాడుతోంది.అప్పు అయితే చేస్తోంది కానీ.. వాటిని తిరిగి తీర్చే మార్గమే కనిపించడం లేదు. 17 ఏళ్ల కాలపరిమితి కావడంతో.. ఇప్పుడు వడ్డీ కడితే సరిపోతుంది. అసలు ఇప్పటికిప్పుడు తీర్చాల్సిన పనిలేదు. దీంతో.. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ తాను గెలిచేది లేదు.. మళ్లీ అధికారంలోకి వచ్చేదీ లేదూ.. 17 ఏళ్ల తర్వాత ఎవరు ఉంటారో ఏమో అనుకుంటూ.. ఏపీ ప్రజల నెత్తిన వేల కోట్ల అప్పు రుద్దేస్తున్నారు. తెచ్చిన డబ్బులన్నీ రాష్ట్ర అభివృద్ధికి కాకుండా సంక్షేమ పథకాల రూపంలో పప్పు-బెల్లంలా పంచేస్తుండటంతో రుణాలన్నీ నిష్పయోజనంగా మారుతున్నాయి. ఏపీ మరింత దివాళ తీస్తోంది..అంటున్నారు.