YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

జగన్ లిక్కర్ పాలసీ భగ్గు మంటున్న జనాలు

జగన్ లిక్కర్ పాలసీ భగ్గు మంటున్న జనాలు

నెల్లూరు, నవంబర్ 11,
ఆంధ్రప్రదేశ్ లో అంతా స్పెషలే. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏపీలో అంతా రివర్స్ పాలన సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. దేశంలోని మిగితా రాష్ట్రాల్లో ఒకలా ఉంటే.. ఏపీలో మరోలా ఉంటోంది. సాగునీటి ప్రాజెక్టులు సహా అన్ని అంశాల్లోనూ అంతే. జగన్ సర్కార్ తీసుకొచ్చిన లిక్కర్ పాలసీపై జనాలు భగ్గుమంటున్నారు. జనాలకు ఇష్టమైన బ్రాండ్లను పక్కనపెట్టి.. నాసిరకమైన కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. ధరలు కూడా భారీగా పెంచేశారు. దీంతో ఏపీకి పక్క రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా సరఫరా అవుతోంది. ఏపీలో ధరలు ఎక్కువగా ఉండడం.. ప్రజలకు అలవాటైన సంప్రదాయ బ్రాండ్లు లేకపోవడంతో.. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని రవాణా చేసుకుని..ఏపీలో విక్రయించే ముఠాలు ఏర్పడ్డాయి. ఏపీతో పోలిస్తే..  తెలంగాణలో మద్యం ధరలు చాలా చౌక. దీంతో ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు చెందిన మద్యం అలవాటు ఉన్న ప్రజలు.. తెలంగాణలోకి వెళ్లి మద్యం తాగి వస్తున్నారు.  కొందరు కొన్ని బాటిళ్లను కొనుగోలు చేసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం తొలుత మూడు బాటిళ్లను తెచ్చుకునేందుకు అవకాశం కల్పించింది. అవి ఏసైజు బాటిళ్లయినా.. అనుమతించింది. గత ఏడాది చివరిలో ఈ మూడు బాటిళ్లను కూడా బ్యాన్ చేసింది. అయినా వివిధ మార్గాల్లో ఏపీకి అక్రం మద్యం బాటిళ్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. లిక్కర్ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పోలీసులు కష్టాలు పడుతుండగా.. తాజాగా జగన్ ప్రభుత్వానికి మరో చిక్కు వచ్చి పడింది. పెట్రోల్ డీజిల్ ధరలు ఏపీలో పక్క రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. దీపావళి సందర్భంగా కేంద్రం పెట్రోల్ పై రూ. 5 డీజిల్ పై రూ.10 వరకు తగ్గింపు ప్రకటించింది. దీంతో పలు రాష్ట్రాలు కేంద్రం బాటలోనే వ్యాట్ తగ్గించుకున్నాయి. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆ రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ.12.  డీజిల్ ధర రూ.17 వరకు తగ్గింది.  కానీ ఏపీ సర్కార్ మాత్రం తగ్గించలేదు. దీంతో కర్ణాటకతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ ధర 12 రూపాయలు, డీజిల్ ధర 17 రూపాయలు ఎక్కువగా ఉంది. దీంతో కర్ణాటక సరహద్దులో ఉన్న బంకులకు ఏపీ జనాలు వెళుతున్నారు. ఏపీ సరిహద్దుల్లోని రాళ్లబుడుగూరు ప్రాంతంలో కర్ణాటకకు చెందిన కెంపేపుర సరిహద్దు ఉంది. ఇక్కడి బంకు యజమానులు.. ఏపీలోను తమ వద్ధ ఉన్న ధరలను పోలుస్తూ..కరపత్రాలను ముద్రించారు. వీటిని తెలుగులో నే ముద్రించి.. ఏపీలో కంటే తమదగ్గరే పెట్రోల్ ధరలు తక్కువని..తమ వద్ద పెట్రోల్ కొనుగోలు చేయాలని కోరుతున్నారు. దీంతో ఇక్కడ పెట్రో బిజినెస్ జోరుగా సాగుతోంది. గతంలో రోజుకు 3000-5000 లీటర్లు అమ్మే ఈ బంకులు.. ఇప్పుడు రోజుకు 15000 నుంచి 18000 లీటర్ల చొప్పున విక్రయిస్తున్నారు. అదే సమయంలో ఏపీ సరిహద్దు ప్రాంతంలో  మొబైల్ విక్రయదారులు కూడా పెరిగిపోయారు. కర్ణాటక నుంచి తెస్తున్న పెట్రోల్ , డీజిల్ ను వారు ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఇది ఏపీ ఖజానాకు గండంగా మారింది. కర్ణాటకలో ధరలు తగ్గించి.. కొంత మేరకు నష్టపోతున్నా.. ఎక్కువ మొత్తంలో పెట్రోల్ డీజిల్ను విక్రయిస్తూ.. ఆ నష్టాన్ని లాభాల రూపంలో మలుచుకుంటోంది.  జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. కర్ణాటక బంకు యజమానులకు వరంగా మారిందని కొందరు చెబుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. మద్యంపై నిఘా పెట్టినట్టే.. సరిహద్దుల్లో జగన్ ప్రభుత్వం పెట్రోల్ ట్యాంకులపైనా నిఘా పెడుతుందా?  పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొనేవారిపై చర్యలు తీసుకుంటుందా?అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కర్ణాటక నుంచి ఏపీలోకి వచ్చే వాహనాలు.. కేవలం 10 లీటర్లకు మించి పెట్రోల్ లేదా డీజిల్ తో రాకూడదని.. జగన్ సర్కారు ఏమైనా నిబంధనలు పెడుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.

Related Posts