హైదరాబాద్, నవంబర్ 11,
తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ కు ఎదురుగాలి వీస్తోందా, అంటే అవుననే సమాధానమే వస్తోంది. విద్యార్ధులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపార, వాణిజ్య వర్గాలు ఉపాధ్యాయులు,ఇలా అన్ని వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.రోజు రోజుకు ఎక్కువవుతోంది. కానీ, అందరి కంటే ఎక్కువగా రైతాంగంలో సర్కార్ పట్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. వరి పంట విషయంలో పూటకో మాట మారుస్తున్న ప్రభుత్వం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లేక్కుతున్నారు. చివరి గింజ వరకు కొంటామని మాటిచ్చి, ఇప్పుడు నెపాన్ని కేంద్ర ప్రభుత్వం, FCI మీద నెట్టి రాష్ట్ర ప్రభుత్వం, చేతులు దులిపేసుకోవడాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఓ వంక కడుపు కాలిన రైతులు ఆగ్రహంతో రగిలిపోతుంటే, ఆర్థిక మంత్రి హరీష్ రావు, మంత్రి నిరంజన రెడ్డి బాధ్యతారహితంగా చేస్తున్న ప్రకటనలు అగ్గికి ఆజ్యం తోడైనట్లు చేస్తున్నాయని, రైతులు, రాజకీయ పార్టీలు ఆగ్రహం చేస్తున్నారు.ఈనేపధ్యంలోనే, ధాన్యం సేకరణకు సంబంధించిన సమస్యలను తెలుసుకునేందుక కాంగ్రెస్ బృందాలు జిల్లాల్లో పర్యటిస్తున్నాయి. ధాన్యం కొనాలంటూ జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. సర్కార్ తీరుకు నిరసనగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. వర్షాలకు వడ్లు తడిసిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు, కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక... మిల్లులు దగ్గర పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల ప్రారంభమైన ఐకేపీ సెంటర్లలో ధాన్యం అమ్ముకునేందుకు ప్రభుత్వ ఆఫీసుల ముందు ఎదురుచూస్తున్నారు. అధికారులు ఇచ్చే టోకెన్ల కోసం ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నారు.సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల వ్యవసాయ అధికారి ఆఫీస్ ముందు టోకెన్ల కోసం బారులు తీరారు రైతులు.తెల్లవారుజామున 4 గంటలకే చలిలో ఆఫీస్ దగ్గరకు చేరుకున్నారు. కొందరు నిలబడలేక పొలం పాస్ బుక్కులు , ఆధార్ కార్డులు క్యూలైన్లో పెడుతున్నారు. 4 రోజుల నుంచి టోకెన్లు కోసం పడిగాపులు కాస్తున్నారు. గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు లేక... మిల్లర్లు వడ్లు కొనకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు రైతులు. అలాగే 15 రోజుల కిందట కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చినా కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ సెంటర్ నిర్వాహకులు, మిల్లర్లు పట్టించుకోవడం లేదని .... హనుమకొండ - సిద్దిపేట రహదారిపై దర్గాపల్లి గ్రామ రైతులు ఆందోళనకు దిగారు.దీంతో భారీగా వాహనాలు నిలిచి పోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండలంలో వరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి- సిరిసిల్ల ప్రధాన రహదారిపై అన్నదాతలు బైటాయించారు. పాత నిబంధనల ప్రకారం వడ్లు కొనుగోలు చేయాలన్నారు.కొత్త రూల్స్ పెట్టి వ్యవసాయాధికారులు ధాన్యాన్ని కొనడంలేదేని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడ ఉన్నా, ఇంతవకు రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు ఎవరూ కూడా, కేంద్రం కొంటేనే రాష్ట్ర ప్రభుత్వం కొంటుందనే మాట చెప్పలేదని, ఇప్పుడు కేంద్ర మీద నెపం నెట్టడం ఎంతవరకు సబబని రైతులు నిలదీస్తున్నారు. కేంద్రం ప్రస్తావన లేకుండా, చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని కూడా రైతులు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి వరికి ఊరి తెరాస మెడకు చుట్టుకుంది. ఇదొక్కటే కాకుండా ఇతర సమస్యలు కూడా కమ్ముకొస్తున్న నేపధ్యంలో తెరాస ప్రభుత్వం ఏడేళ్ళలో తొలిసారిగా తీవ్ర ప్రజాగ్రహాన్ని చవిచూస్తోందని అంటున్నారు.