హైదరాబాద్, నవంబర్ 12,
కేంద్రం మీద తెలుగు రాష్ట్రాల సీఎంలు యుద్ధం ప్రకటించారు. మోడీ సర్కార్‌తో తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారు. ఎన్డీయేలో సభ్యులు కాకున్నా ఇన్ని రోజులు కేంద్ర సర్కారుకు మద్దతు పలికిన కేసీఆర్, జగన్‌లు తిరుగుబాట పట్టారు. పెట్రో ధరల విషయంలో కేంద్రం తీరును ఎండగడుతూ ఇద్దరు సీఎంలు సంచలన ప్రకటనలు చేశారు. అయితే ఇన్నాళ్లూ స్నేహం చేసిన బీజేపీతో ఇక యుద్దమేనని కేసీఆర్, జగన్ సంకేతాలివ్వడం ఉమ్మడి వ్యూహమా అన్నట్లుగా తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఒకేసారి పెట్రో ధరలపై పోరుకు దిగడం చర్చనీయాంశమైంది. బీజేపీయేతర, కాంగ్రెసేతర జాతీయ కూటమి ఏర్పాటు ప్రక్రియ మళ్లీ వేగం పుంజుకుందా అనే చర్చకు తెరలేపారు. పెట్రో ధరలకు సంబంధించి పన్నుల వసూలు విధానాలను మోదీ సర్కారు ఉద్దేశపూర్వకంగా తనకు అనుకూలంగా మార్చుకుందని పెట్రో ఆదాయాన్ని డివిజబుల్ పూల్‌లోకి రాకుండా సెస్‌లు, సర్‌ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నారని కేసీఆర్, జగన్ ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. పెట్రోల్ పై వ్యాట్ లో నిబంధనల ప్రకారం రాష్ట్రాలకు కూడా 41 శాతం వాటా లభిస్తుంది. కానీ మోదీ సర్కార్ కావాలనే వ్యాట్ కాకుండా అదనపు నిధులు సమకూర్చుకునే సెస్ విధానాన్ని పెట్రోపై అమలు చేస్తోంది. ఇది రాష్ట్రాల కడుపు కొట్టడమేనని కేసీఆర్, జగన్ ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై 3 లక్షల 35 వేల కోట్లు వసూలు చేస్తే అందులో రాష్ట్రాలకు పంచింది కేవలం 19 వేల 745 కోట్లు మాత్రమేనని అంటే కేవలం 5.8 శాతం మాత్రమే అని జగన్ సర్కారు పేర్కొంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఇదే తరహా వాదన వినిపిస్తూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. పెట్రో ధరలు కొండంత పెంచి, పిరసరంత తగ్గించిన కేంద్రం అదేదో ఘనకార్యం చేసినట్లు రాష్ట్రాలనూ ధరలు తగ్గించాలనడం విడ్డూరంగా ఉందని కేసీఆర్, జగన్ వాదిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర పెరగకున్నా కేంద్రం అబద్దాలు చెప్పి అధిక పన్నులు వసూలు చేస్తూ జనాన్ని ఏడిపిస్తోందన్నారు. ట్యాక్సులు పెంచింది కేంద్రమైతే రాష్ట్రాలను తగ్గించడమనమేంటని ఫైరయ్యారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం వసూలు చేస్తోన్న అన్ని సెస్‌లు వెంటనే వెనక్కు తీసుకోవాలని, తద్వారా పెట్రోల్ ధర 77 రూపాయలకి తగ్గుతుందని, అలా చేయని పక్షంలో దేశంలో అగ్గిరాజేసే ఉద్యమానికి తానే శ్రీకారం చుడతానని కేసీఆర్ హెచ్చరించారు. పెట్రో ధరలతోపాటు వ్యవసాయ చట్టాల విషయంలోనూ రాష్ట్రాల నోరుకొడుతోన్న కేంద్రానికి వ్యతిరేకంగా తెలంగాణ కేబినెట్ మొత్తం ఢిల్లీలో ధర్నాకు దిగుతుందని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ గానీ, ఏపీలో అధికార వైసీపీగానీ ఇన్నాళ్లూ కేంద్రంలోని మోదీ సర్కారుకు సహకారాన్ని అందించాయి. ఎన్డీఏ మిత్రులు సైతం వ్యతిరేకించిన వివాదాస్పద బిల్లులకూ జగన్, కేసీఆర్ మద్దతు పలికారు. అయితే కరోనా అనంతర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ చితికిపోయిన నేపథ్యంలో రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమంటూ ఇప్పుడు ఇద్దరు సీఎంలు పోరాటానికి దిగారు. మిగతా రాష్ట్రాల సీఎంలకు విరుద్ధంగా పెట్రోల్ ధరల్ని తగ్గించబోమని కేసీఆర్, జగన్ ప్రకటనలు చేశారు. పెట్రో ధరలపై కేంద్రంతో పోరాటానికి సంబంధించి జగన్, కేసీఆర్ ప్రకటనలు చేయడంతో వీళ్లిద్దరూ ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారా అనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ చాలా కాలం నుంచి చెబుతోన్న 'బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్' ఏర్పాటుకు పెట్రో మంటలు కలిసొస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కలిసివచ్చే పార్టీలను వెంటపెట్టుకుని కేంద్రంతో పోరాడటానికి ఇదే సరైన సమయమనీ వారు భావిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ గతంలోనూ మూడో ఫ్రంట్ ప్రస్తావన తెచ్చి వెనక్కి తగ్గారు. మరి ఈ సారైనా థర్డ్ ఫ్రంట్‌ను పట్టాలెక్కిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.