గుంటూరు, నవంబర్ 12,
సత్యం చెప్పే హరిచ్ఛంద్రులం.. అవసరానికో అబద్ధం అన్నట్టు.. రాజకీయ నాయకుల నిర్ణయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. వచ్చిన అవకాశాలను అనుకూలంగా మలుచుకోవడంలో పొలిటీషియన్స్‌ను మించివాళ్లు ఉండరు. గుంటూరు పాలిటిక్స్‌లో ఇప్పుడదే జరుగుతోంది. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబుకు బాగా కలిసొచ్చిందనే చర్చ మొదలైంది.రెండేళ్ల క్రితం రావెల బీజేపీలో చేరారు. కాషాయం కండువా కప్పుకొని కనిపిస్తున్నా.. ఆయన మనసంతా టీడీపీలో ఉన్నట్టు, సైకిల్‌ను బాగా మిస్సవుతున్నట్టు అతని సన్నిహితులు చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో చేరినా.. తిరిగి టీడీపీలోకి వచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర రావెలకు ఇప్పుడా అవకావాన్ని కల్పించిందని, అందుకే తాటికొండలో మొదలైన పాదయాత్రను అంతా తానై తిరుమల వరకు నడిపించేందుకు రావెల ప్లాన్ సుకున్నారని తెలుస్తోంది.పాదయాత్రకు ఏ పార్టీ నాయకులు వచ్చినా వారిని ఆహ్వానించి సందడి చేస్తున్నారు రావెల. ముఖ్యంగా టీడీపీ నేతలు ఎరపతినేని, ధూళిపాళ్ల, ప్రత్తిపాటి లాంటి సీనియర్ లీడర్లను అంటుకుని తిరుగుతున్నారు. టీడీపీ నేతలు కూడా రావెల అనవసరంగా బీజేపీలోకి వెళ్లారని కార్యకర్తలతో చెబుతున్నారు. రావెల కూడా నేనెప్పుడూ మీ వాడినే అంటూ వారిని కుషీ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మందకృష్ణ, చంద్రబాబుల మధ్య జరిగిన రహస్య భేటీలో రావెల కీలకంగా పనిచేశారని కూడా తెలుస్తోంది. దీంతో టీడీపీలోకి రావెల రీ ఎంట్రీ ఖాయమని, అధినేత అంగీకారం కూడా ఉందనే ప్రచారం మొదలైంది.ప్రస్తుతం ఆంధ్రాలో రాజకీయం చేయాలంటే టీడీపీ, లేదా వైసీపీలో ఉండటం ఒక్కటే మార్గమని, బీజేపీలో ఉండటం వల్ల లాభం లేదని రావెల ఫీలవుతున్నట్టు సమాచారం. ఎలాగూ వైసీపీలో చేరే ఛాన్స్ లేకపోవడం, తనను మంత్రిని చేసిన చంద్రబాబుపై కృతజ్ఞత ఉండటంతో.. సైకిల్ ఎక్కడం ఒక్కటే తనముందున్న మార్గం అని రావెల భావిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ కూడా రావెల రీ ఎంట్రీతో ఎస్సీ ఓటు బ్యాంకును ఆకట్టుకోవచ్చని ఆలోచిస్తోంది. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా రావెలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. మరి ఫైనల్ డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలి