నిర్మాణ సంస్థలు: వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్
నటీనటులు: కీర్తి సురేశ్, మోహన్‌బాబు, నాగచైతన్య, ప్రకాశ్‌రాజ్, క్రిష్, అవసరాల శ్రీనివాస్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, భానుప్రియ, మాళవికానాయర్, షాలిని పాండే, తులసి, దివ్యవాణి, తరుణ్ భాస్కర్ తదితరులు
సంగీతం: మిక్కీ జె.మేయర్
ఛాయాగ్రహణం: డానీ షాంజెక్ లోఫెజ్
కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు
కళ: అవినాశ్
నిర్మాత: ప్రియాంక దత్
దర్శకత్వం: నాగ్ అశ్విన్
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. ఇలాంటి ట్రెండ్‌లో దక్షిణాది తొలి మహిళా సూపర్‌స్టార్ సావిత్రి జీవితగాథను సినిమాగా తెరకెక్కించడం అంటే సాహసమే. ఇప్పటి తరం సావిత్రి పేరు విని ఉండొచ్చు, ఆమె ఫొటోనో, ఎక్కడో ఒక సందర్భంలో ఆమె నటించిన సినిమానో చూసి ఉండవచ్చు. కానీ ఆమె పూర్తిస్థాయి జీవితం ఎవరికీ చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే మనుపటి తరానికి చెందిన చాలా మంది సావిత్రి గురించి ఆమె సినిమాల్లో, వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి అనే పలు విషయాలను రీసెర్చ్ చేసి పుస్తక రూపంలో కూడా పొందుపరిచారు. అలాంటి కొన్ని విషయాలను, మరికొన్ని రీసెర్చ్ చేసి సంపాదించిన విషయాలను సంగ్రహించి సినిమాగా చేశారు. `మహానటి` పేరుతో నాగ్ అశ్విన్ అనే ఓ దర్శకుడు.. అది కూడా ఓ సినిమా మాత్రమే చేసిన దర్శకుడు తెరకెక్కిస్తాడని తెలియడంతో చాలా మంది అసలు ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేయడం? సావిత్రిగారి జీవితంలో చాలా వరకు మరుగున పడ్డ విషయాలను సినిమాగా మలుస్తారా? అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే టైటిల్ పాత్రలో నటించిన లుక్ నుండి సినిమాలో క్యాస్టింగ్ విషయంలో యూనిట్ కనపరిచిన శ్రద్ధ అందరిలో సినిమాపై ఆసక్తిని పెంచాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఎలా తీస్తాడో? అని అనుకున్న వారందరూ అసలు ఎలా తీసి ఉంటాడోనని అనుకునేంతగా సినిమా ఆసక్తిని క్రియేట్ చేసుకుంది. మరి `మహానటి`లో దర్శకుడు చెప్పాలనుకున్నదేంటి? సావిత్రి గురించి దర్శకుడు కొత్తగా చెప్పిన విషయమేంటి? అనే విషయాల్లోకి వెళ్లే ముందు కథలోకి వెళదాం...
కథ:
బెంగళూరు చాళుక్య హోటల్‌లో సావిత్రి(కీర్తి సురేశ్) కోమాలో ఉంటుంది. సావిత్రి గొప్ప నటి. ఎన్నో గొప్ప పాత్రలు చేసి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఆమ కోమా స్టేజ్‌లోకి హాస్పిటల్‌లో ఎందుకు ఉండాల్సి వచ్చింది. అసలేం జరిగింది అనే దానిపై ప్రజావాణి పత్రిక న్యూస్ కవర్ చేయాలనుకుంటుంది. అందులో భాగంగా మధురవాణి(సమంత), ఫొటోగ్రాఫర్ విజయ్ ఆంటోని (విజయ్ దేవరకొండ) వివరాలు సేకరించడం మొదలు పెడతారు. కథ అలా సావిత్రి గురించి స్టార్ట్ అవుతుంది. విజయవాడలో బాల్య దశ నుంచి సావిత్రి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం క్రమంగా స్టార్ హీరోయిన్‌గా ఎదగడం. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న జెమిగణేశన్‌ను వివాహం చేసుకోవడం.. హీరోయిన్‌గా తిరుగులేని వైభవాన్ని చూడటం. అంతలోనే భర్తతో విభేదాలు రావడం తాగుడుకి బానిస కావడం. చివరకు కోమా దశలో ప్రాణాలు విడిచిపెట్టిన అలనాటి సావిత్రి. ఇలా మహానటి సావిత్రి జీవితంలో వివిధ కోణాలను యూనిట్ అందంగా ఆవిష్కరించింది. అసలు సావిత్రికి భర్తతో ఎందుకు విబేదాలు వచ్చాయి? ఎందుకు ఆమె కోమాలోకి వెళ్లింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
నటీనటుల పరంగా చూస్తే.. టైటిల్ పాత్రలో నటించిన కీర్తిసురేశ్ అచ్చం సావిత్రిలాగానే ఒదిగిపోయింది. ముఖ్యంగా లుక్ పరంగా చూడటానికి సావిత్రిని తలపించింది. అతిశయోక్తి అనుకోకపోతే.. సావిత్రి మరోసారి పుట్టిందేమో అనేంత గొప్పగా నటించింది. ఇక సావిత్రి సినిమా, నిజ జీవితం సమాంతరంగా నడిచాయి. స్టార్ హీరోయిన్‌గా, భార్య,తల్లిగా ఇలా వివిధ దశల్లో ఆమె జీవించిన క్రమంలో మార్పులను, హావభావాలను కీర్తి సురేశ్ చక్కగా పలికించింది. జెమినిగణేశన్‌లా దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించాడు. నిజ జీవితంలో జెమిని గణేశన్ ఎలా ఉండేవారో అలాంటి ఓ పాత్రను చేయడమంటే చిన్న విషయం కాదు. అలాంటి ఓ పాత్రను దుల్కర్ చేసిన అలరించినందుకు తనను అభినందించాలి. సావిత్రి విషయంలో జెమిని గణేశన్ ప్రేమ ఎలా ఉండేది. ఆమె ఉన్నతిలో ఆయనకు ఎలాంటి ఈర్ష్య ద్వేషాలుండేది అనే విషయాలను చక్కగా చూపించారు. స్టార్ హీరోయిన్ సమంత పాత్ర పరిమితం. అయితే కథను డ్రైవ్ చేసే ఫోర్స్ ఆమె దగ్గర నుండే స్టార్ట్ అవుతుంది. పాత్ర పరిమితమే అయినా విజయ్ దేవరకొండతో కలిసి ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. ఇక సావిత్రి పెద్ద నాన్న కె.వి.చౌదరి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, ప్రజావాణి పత్రిక ఎడిటర్ పాత్రలో తనికెళ్ల భరణి, సావిత్రి తల్లి సుభద్రమ్మ పాత్రలో భానుప్రియ, సావిత్రి మేనత్త దుర్గాంబగా దివ్యవాణి, జెమిని గణేశన్ మొదటి భార్య అలమేలు పాత్రలో మాళవికా నాయర్, సావిత్రి స్నేహితురాలు సుశీల పాత్రలో షాలిని పాండే తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. అయితే మాయాబజార్ సినిమా కోణాన్ని ఇందులో చూపించారు.
అందులో ఎస్.వి.రంగారావుగా నటించిన మోహన్‌బాబు, అక్కినేని పాత్రలో నాగచైతన్య చక్కగా సూట్ అయ్యారు. ఇక అలూరి చక్రపాణిగా ప్రకాశ్ రాజ్, ఎల్.వి.ప్రసాద్ పాత్రలో శ్రీనివాస్ అవసరాల, ఆదూర్తి సుబ్బారావుగా సందీప్ వంగా, సింగీతం శ్రీనివాసరావుగా తరుణ్ భాస్కర్, కె.వి.రెడ్డి పాత్రలో క్రిష్ అందరూ అతిథి పాత్రల్లో నటించి అలరించారు. అయితే క్రిష్ చేసిన కె.వి. రెడ్డి పాత్ర నిడివి కాస్త ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుటుంది. సాంకేతిక నిపుణుల పరంగా చూస్తే.. ఈ విభాగంలో మందుగా దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత ప్రియాంక, స్వప్నదత్‌లను అభినందించాలి. ఓ పర్టికులర్ పీరియడ్‌లో ఓ మహానటి జీవితగాథను తెరకెక్కించడం సాధారణ విషయం కాదు. కానీ.. వీరి పట్టుదల వల్లే మహానటి సినిమాగా రూపొందింది. విషయాన్ని సేకరించి దాన్ని నాగ్ అశ్విన్ అందమైన సినిమాగా తీర్చిదిద్దాడు. సావిత్రి గురించి అందరికీ తెలిసిన విషయాలే అయినా ఎక్కడా ఫ్లో మిస్ కాకుండా చక్కటి సినిమా రూపంలోకి తీసుకొచ్చారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మిక్కీ జె.మేయర్ ఇప్పటి వరకు సంగీతం, నేపథ్య సంగీతం అందించిన సినిమాలకు భిన్నమైన సినిమా మహానటి. ఓ పీరియాడికల్ సినిమా. అందులో వివిధ కోణాలు ఆవిష్కరించారు.
ఒక పక్క సినిమాలు, మరో పక్క జీవిత చరిత్ర. ఇన్ని కోణాలను టచ్ చేసే క్రమంలో సంగీతం సినిమాకు ఎసెట్ అయ్యింది. ఇక సినిమాటోగ్రాఫర్ డానీ ప్రతీ సీన్‌ను అద్భుతంగా చూపించాడు. ఇక సావిత్రి బయోపిక్ అంటే ఆమె వాడిన దుస్తులు, కేశాలంకరణ వస్తువులు, హెయిర్ స్టైల్ ఇలా అన్నీ డిఫరెంట్‌గానే ఉంటాయి. వీటిని అవినాశ్ తన కళా దర్శకత్వంలో ఒదిగిపోయేలా చేశారు. 1970 నాటి పరిస్థితులను సినిమా రూపంలో తెరకెక్కించడం అంటే ప్రతీ విషయంలో ఓ పర్టికులర్ ఉంటుంది. దాన్ని దర్శకుడు చక్కగా పాటించాడు. సంగీతం, ఆర్ట్ వర్క్, కెమెరావర్క్ సినిమాకు వెన్నెముకగా నిలిచాయి. అవే సినిమాను ఓ హృదయ కావ్యంలా తెరపై ఆవిష్కరింపచేశాయి. సినిమా చూసే ప్రేక్షకుడికి సావిత్రి ఇంత గొప్ప నటా! అనే విషయంతో పాటు ఆమెలో ఉన్న మానవత్వం కూడా తెలుస్తుంది. రెండు, మూడు చోట్ల ఎడింటింగ్ సమస్యలు తప్ప.. సినిమా ఫ్లో ఎక్కడా మిస్ కాదు. సినిమా చూసినంత సేపు ఓ ఉద్వేగానికి గురైన ప్రేక్షకుడికి ఆ తర్వాత కూడా ఆ సినిమా గుర్తుకు వస్తుందంటే అంతకంటే గొప్ప సినిమా ఏముంటుంది. ఈ విషయంలో చిత్ర యూనిట్ పెద్ద సక్సెస్‌ను అందుకుంది. ప్రతిభ ఇంట్లో కూర్చుంటానంటే ప్రపంచం ఒప్పుకోదు.. నీ కలలు కూడా నేను కన్నాను.. నీరు కార్చేశావు కదే అని సందర్భానుసారంతో పాటు వచ్చే సంభాషణలు మెప్పిస్తాయి. అయితే మధురవాణి వెతుకుతున్న శంకరయ్య ఎవరనేది సన్పెన్స్‌గానే ఉండిపోయింది.
రేటింగ్: 3.75/5