వాయు కాలుష్యం పై కేజ్రీవాల్ అత్యవసర సమావేశం
న్యూఢిల్లీ నవంబర్ 13
దేశ రాజధానిలో వాయు కాలుష్యం ప్రమాదకరస్ధాయికి చేరడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాలుష్య నియంత్రణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపధ్యంలో కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో సాయంత్రం ఐదు గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్, పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ గౌబ ఈ సమావేశానికి హాజరుకానున్నారు.ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్‌ణకు తక్షణ చర్యలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొంది. ఢిల్లీలో లాక్‌డౌన్ విధించే ప్రతిపాదననూ పరిశీలించాలని కోరింది. కాలుష్య నియంత్రణకు సత్వరమే చర్యలు చేపట్టి సోమవారం నివేదిక సమర్పించాలని ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలను సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది.