సామాజిక స్పృహతో పని చేసేవారిని ప్రతినిధులుగాఎన్నుకోవాలి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్
అమరావతి నవంబర్ 13
స్థానిక సమస్యలపై అవగాహనతో, సామాజిక స్పృహతో పని చేసేవారిని స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎన్నుకొంటే ప్రజా గళం ప్రతిధ్వనిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థతోపాటు 12 మున్సిపాలిటీలకు ఈ నెల 15వ తేదీన జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున అభ్యర్థులు బరిలో నిలిచారు. వీటితోపాటు మరికొన్ని పురపాలక, నగర పాలక సంస్థల్లోనూ, ప్రజా పరిషత్తుల్లో వచ్చిన ఉప ఎన్నికల్లో జనసేన పోటీలో నిలిచింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థులకు ఓ ప్రకటన ద్వారా అభినందనలు తెలిపారు.ఒక మార్పు కోసం ఈ పోరాటం. జనసైనికులు పదవుల కోసం కాకుండా సేవచేయడానికే ముందుంటారని విజ్ఞులైన మీకు తెలిసిన విషయమేనని పవన్ కళ్యాణ్ చెప్పారు. అన్ని వేళలా ప్రజల కోసం పని చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడేవారినే ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి అవకాశం కల్పించాము. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకున్న అభ్యర్థులు పోటీలో నిలిచారు. జనసేనతో మైత్రి ఉన్న బీజేపీ కొన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. మన బిడ్డల పాతికేళ్ల భవిష్యత్తు కోసం పరితపించే జనసేన అభ్యర్థులకు ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆయన అన్నారు.నెల్లూరు కార్పొరేషన్ తోపాటు ఆకివీడు, బుచ్చిరెడ్డి పాళెం, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, కుప్పం, దర్శి, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలతోపాటు, విశాఖ, గుంటూరు కార్పొరేషన్లు, రేపల్లె మున్సిపాలిటీల్లో ఉప ఎన్నికలు, పలు జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు.