సంక్షోభంలోనూ సవాళ్లను అధిగమిస్తూ అభివృద్ధి సాధించడం జరిగిందని, ఇదే స్పూర్తిని కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే మనసు పెడితే అద్భుతాలు సాధించవచ్చన్నారు. అమరావతిలో బుధవారం రెండో రోజు జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ మనలా ధనిక రాష్ట్రాలు కూడా కార్యక్రమాలు చేయలేక పోయాయన్నారు. నాలుగేళ్ల విజయాల్లో గ్రామస్థాయి అధికారి నుంచి సీఎంవో వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఉందన్నారు. ఒక స్థాయికి వచ్చాం, దానిని నిలుపుకునేందుకు మరింత కష్టపడాలన్నారు. రహదారులపై గుంతలు లేకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసేలా నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని సూచించారు. జాతీయ రహదారుల మరమత్తులకు నిధులు ఇవ్వకపోతే తామే చేసుకుందాం, అవసరమైతే అందుకోసం ఒక ప్రత్యేక బోర్డ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీసీ కెమెరాలతో రహదారుల నిర్మాణం పర్యవేక్షణ జరగాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి సంబంధించినంత వరకూ వ్యక్తిగతంగా తాను చాలా పూర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. లీడర్ తప్పనిసరిగా ఐటి వ్యక్తి కావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. టెక్నాలజీతో ఏం చేయాలో, ఎలా చేయాలో తెలిస్తే చాలునని ఆయన చెప్పారు. ఐటిని పాలనలో ఎంతో విజన్తో ఉపయోగించామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శిల్పారామాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. శిల్పారామాల ఏర్పాటే కాదు, వాటి నిర్వహణ ఉత్తమంగా ఉండాలని సూచించారు. అమరావతిలో శిల్పారామం ఏర్పాటుకు 20 ఎకరాలు కేటాయించాలన్నారు. 9 జిల్లాల్లో చేపట్టిన శిల్పారామం పనులను త్వరతగతిన పూర్తి చేయండని కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఆదేశించారు.