నెల్లూరు, నవంబర్ 15,
ఎమ్మెల్సీ పదవుల కేటాయింపు వైసీపీలో అసంతృప్తి రేగుతుంది. బలహీనమైన నాయకులను ఎంపిక చేశారన్న వాదనలు విన్పిస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారిని కాదని, పైరవీలకే పెద్ద పీట వేస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో తూమాటి మాధవరావు ఎంపికపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. అదే సమయంలో గుంటూరులో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మూరుగుడు హన్మంతరావు ఎంపిక పై కూడా పెదవి విరుపులు వినపడుతున్నాయి. కమ్మ సామాజికవర్గంలో బలమైన నేతలు మర్రి రాజశేఖర్, రావి వెంకటరమణ కు పదవులు ఇవ్వకపోవడంపై పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిన కమ్మ సామాజికవర్గం నేతలిద్దరికీ వారి నియోజకవర్గాల్లోనూ బలం లేదంటున్నారు. జగన్ కమ్మ సామాజికవర్గానికి ఈసారి రెండు పదవులు ఇచ్చారు. వారిలో తలశిల రఘురాం ఒకరు. ఆయన ఇప్పటికే కేబినెట్ హోదాలో ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల అమలును ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇక మరొక నేత ప్రకాశం జిల్లాకు చెందిన తూమాటి మాధవరావు. ఈయన కందుకూరు నియోజకవర్గంలో 2017 ప్రాంతంలో వైసీపీ సమన్వయకర్తగా పనిచేశారు. పార్టీలో ఉన్నప్పటికీ ఆయన ఆ సామాజికవర్గంలో బలమైన నేత కాదు. అన్నీ ఆయన కుటుంబానికేనా? ఇక గంటూరు జిల్లాలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మరోసారి ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ అయింది. ఆయన కుటుంబానికి ఎన్ని పదవులు ఇస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఉమ్మారెడ్డి ఒకసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ప్రభుత్వ విప్ గా కూడా చేశారు. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్సీని చేశారు. ఆయన అల్లుడు కిలారు రోశయ్య పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికలలో ఉమ్మారెడ్డి అల్లుడి వియ్యంకుడికి టిక్కెట్ ఇచ్చారు. అన్నీ పదవులు ఆ కుటుంబానికే అయితే ఎలా అన్న ప్రశ్న వినపడుతుంది. వైసీపీని తొలి నుంచి నమ్ముకుని ఉన్న రావి వెంకటరమణకు జగన్ హ్యాండ్ ఇచ్చారు. సంగం డెయిరీ విషయంలోనూ ఆయన కీలక ఆధారాలను జగన్ కు చేర్చారంటారు. ఆయనకు కేవలం పొన్నూరులోనే కాకుండా గుంటూరు, ప్రత్తిపాడులో బలమైన వర్గం ఉంది. ఆయనను కాదని కమ్మ సామాజికవర్గం కింద ప్రకాశం, కృష్ణా జిల్లాల నేతలను ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. బలమై క్యాడర్ ఉన్న రావి వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదన్న అసంతృప్తి వైసీపీలో ఉంది. మంగళగిరిలోనూ మురుగుడు హన్మంతరావుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై అసంతృప్తి ఉంది. ఆ పార్టీ నేత మునగాల మల్లేశ్వరరావు ఫైర్ అయ్యారు. పదవులను అనుభవించిన వారికి, అవినీతి ఆరోపణలున్న వారికి ఎలా పదవి ఇస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆప్కో ఛైర్మన్ గా అవినీతికి పాల్పడిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. మొత్తం మీద గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ పదవుల ఎంపిక జగన్ కు ఇబ్బందికరంగా మారేటట్లే ఉంది.