న్యూఢిల్లీ, నవంబర్ 15,
దేశ రాజధానిలో పొల్యూషన్ తీవ్రతపై సుప్రీంకోర్టు సీరియసైంది. ‘‘ఇండ్లల్ల కూడా జనం మాస్కులు పెట్టుకోవాల్సిన దారుణ పరిస్థితులున్నయి. ఎమర్జెన్సీ సిచ్యుయేషనిది” అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు తగలబెట్టడమే సమస్యకు కారణమన్నట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతున్నారని తప్పుబట్టింది. ‘‘అదీ కొంత కారణమే. కానీ ఢిల్లీ కాలుష్యానికి బండ్ల పొగ, పటాకులు, దుమ్ము వంటివే అసలు రీజన్లు” అభిప్రాయపడింది. ప్రతిదానికీ రైతులను నిందించడం అందరికీ ఫ్యాషనైందంటూ మండిపడింది. ‘‘సమస్య పరిష్కారానికి మీరేం చర్యలు తీసుకున్నరు? ఢిల్లీలో వాహన కాలుష్యాన్ని, పటాకుల గోలను కంట్రోల్ చేసే మెకానిజమేది? అసలు ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నట్టు? ముందు వాళ్లను కంట్రోల్ల పెట్టండి” అంటూ క్లాసు తీసుకుంది. ‘‘ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను కనీసం 200 స్థాయికి తగ్గించే మార్గం ఆలోచించండి” అని సూచించింది.చిన్న, సన్నకారు రైతులకు పంట వ్యర్థాలను తొలగించే యంత్రాలను ఫ్రీగా సప్లై చేసేలా చూడాలంటూ పర్యా వరణవేత్త ఆదిత్య దూబే, లా స్టూడెంట్ అమన్ బంకా పెట్టుకున్న పిటిషన్ పై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ శనివారం విచారణ జరిపింది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీని పెంచేందుకు అవసరమైతే రెండు రోజులు లాక్ డౌన్ విధించాలని కేంద్రానికి సూచించింది. ‘‘ఇంతటి పొల్యూషన్లోనే పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నారు. వాళ్ల ఆరోగ్యాలు ఏమవుతాయి? సమస్యేమిటి, దాని పరిష్కార బాధ్యత ఎవరిది అన్నదే మా ప్రశ్న. ఆ పని కేంద్రం చేస్తుందా, రాష్ట్రాలా అన్నదానితో నిమిత్తం లేదు. ఇది రాజకీయ సమస్య కాదు. అందరి సమస్య. అంతిమంగా పొల్యుషన్ లెవల్స్ అర్జెంటుగా దిగిరావాలన్నదే మా ఉద్దేశం” అని జస్టిస్ రమణ స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికి కేంద్రం, రాష్ట్రాలు ఎవరి ప్రయత్నం వాళ్లు చేస్తున్నారని ఎస్జీ బదులిచ్చారు. ‘‘కేంద్రం కూడా ఏ రాష్ట్రంపైనా నేరం మోపడం లేదు. సమస్యకు రైతులే కారణమన్నది నా ఉద్దేశం అసలే కాదు. అయితే పంజాబ్, హర్యానాల్లో ఐదారు రోజులుగా భారీగా పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు. దీన్ని నియంత్రించేందుకు అవసరమైతే అలాంటి రైతులపై పర్యావరణ పరిహారం విధించాలని ఆ రాష్ట్రాలకు సూచించాం” అని వివరించారు. ఇలాంటి చర్యలతో రైతులను బలవంతపెట్టలేమని బెంచ్ అభిప్రాయపడింది. ‘‘దానికి బదులు వారికి ప్రోత్సాహకాలివ్వాలి. యూపీ, పంజాబ్, హర్యానాల్లో చాలామంది మూడెకరాల్లోపున్న సన్నకారు రైతులే. పంట వ్యర్థాలను తొలగించే మెషీన్లను కొనే స్తోమత వారిలో చాలామందికి ఉండదు. వాటిని కేంద్రం, రాష్ట్రాలే వాళ్లకు అందించొచ్చు. పంట వ్యర్థాలను సేకరించి పేపర్ తయారీకి, చలికాలంలో రాజస్థాన్ వంటి చోట్ల మేకల మేతగా, ఇంకా చాలారకాలుగా ఉపయోగించొచ్చు’’ అని సూచించింది.వ్యర్థాల సేకరణకు, పొలాల నుంచి ప్లాంట్ల దాకా తరలించేందుకు ఎలాంటి ఒప్పందా లు చేసుకున్నారని ఎస్జీని బెంచ్ ప్రశ్నించింది. పలు ఏజెన్సీలను నియమించుకుంటున్నామని, ఇప్పటికే టెండర్లు పిలిచామని ఆయన బదులిచ్చారు. కోతలు పూర్తవుతూనే వచ్చే సీజన్ కోసం పొలాన్ని సిద్ధం చేసుకోవాల్సిన ఒత్తిడి రైతులపై ఉంటుంది గనుక తక్షణం చర్యలు తీసుకోవాలని జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ‘‘ఈ విషయంలో మీ ఆఫీసర్లు పాలసీ తేవడం బాగానే ఉంది. కానీ దాన్ని ఎంత స్పీడుగా అమలు చేయబోతున్నారు? రైతులిప్పుడు ఖరీఫ్ కోసం పొలాలను సిద్ధం చేసుకునే తొందరలో ఉన్నారు. కాబట్టి 15 రోజుల్లోగా పంట వ్యర్థాలన్నింటినీ తొలగించే ఏర్పాటు చేయగలరా?” అని ప్రశ్నించారు. ఎస్జీ సమయం కోరడంతో పూర్తి వివరాలతో రావాలంటూ విచారణను సోమవారానికి బెంచ్ వాయిదా వేసింది.