
కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం లో భారీ బ్యాంకు కుంభకోణం బయటపడింది. స్టేట్ బాంక్ ఆ ఇండియా మచిలీపట్నం మెయిన్ బ్రాంచిలో సిబ్బంది మూడున్నర కోట్ల పైనే స్వాహా చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా వున్నాయి. జిల్లాలోని గ్రంధాలయంకు సెస్ రూపంలో వసూలు అయినా ప్రజా ధనాన్ని ఆయా పద్దులనుండి స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలోకి జమ అవుతాయి. ఆ విధంగా 31 చెక్కలు గ్రంథాలయ సెస్ అకౌంటుకు జమ అవ్వాల్సి ఉండగా కేవలం 25 చెక్కులే జమయ్యాయి. మిగతా 6 చెక్కుల కు సంబంధించిన 3 కోట్ల,56 లక్షల,36 వేల,708 రూపాయిలు సొమ్ము గ్రంధాలయా ఖాతాలోకి జమ కాకపోవడంతో గ్రంథాలయ అధికారులు ఎస్బీఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ బృందాన్ని రంగంలోకి దింపారు. . స్వాహా చేసిన సొమ్ములో 2కోట్ల6 లక్షల రూపాయలు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా 10 అకౌంట్లలోకి బదిలీ చేసినట్లు విచారణ బృందం తేల్చింది. 2015 మార్చ్ నుండి 2018 మార్చ్ వరకు పనిచేసిన డిప్యూటీ మేనేజర్ మండలిక వంశీ కృష్ణ మూర్తి ఈ కుంభకోణంకు ముఖ్య సూత్రధారి అని నిర్ధారణ అయింది. దాంతో బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.డీఎస్పీ ధర్మేంద్ర ఆధ్వర్యంలో క్రైమ్ టీం దర్యాప్తు ప్రారంభించింది. వంశీ కృష్ణ, అసిస్టెంట్ మేనేజర్ శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రీజినల్ మేనేజర్, చీఫ్ మేనేజర్ లపై బదిలీ వేటు పడింది.