YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ డుమ్మా లెక్కేంటీ

కేసీఆర్ డుమ్మా లెక్కేంటీ

హైదరాబాద్, నవంబర్ 16,
దక్షిణాది రాష్ట్రాల ప్రజాసమస్యల పరిష్కారం లక్ష్యంగా తిరుపతిలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ తమ సమస్యలను కేంద్ర హోమ్ మంత్రి, సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అమిత్ షా విన్నవించుకున్నాయి. ఈ సమావేశం ప్రధానంగా ముఖ్యమంత్రులు సమావేశం. కానీ, తెలంగాణ, తమిళ నాడు, కేరళ ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. వరదల కారణంగా తమిళనాడు ముఖ్యమంత్రి హాజరు కాలేక పోతున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.   నిజానికి, ఇతర దక్షిణాది రాష్ట్రాల కంటే, ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఈ వేదిక అవసరం కొంచెం చాలా ఎక్కువ. ఒక విధంగా, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబందించే కాకుండా, ఇరుగు పొరుగు రాష్ట్రాల సంబంధాలు, సమస్యలు చర్చించుకునేందుకు ఇదొక చక్కని అవకాశం. ఇతర విషయాలు ఎలాఉన్నా, రాష్ట్ర విభజన జరిగి ఏడు సంవత్సరాలు పూర్తయినా, విభజన హామీలు అనేకం ఇంకా అలాగే ఉన్నాయి. అంతే కాదు, రాష్ట్ర విభజన నేపధ్యంగా ఏడేళ్ళ కాలంలో కొత్తగా తలెత్తిన సమస్యలూ చాలానే ఉన్నాయి. ఈ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లేందుకు, ఏపీతోనే కాకుండా ఇతర ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలను నేరుగా చర్చించుకునేందుకు సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం వేదిక ఒక చక్కని అవకాశం. అయితే, ఇంత కీలక సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం, తీసుకోవల్సినంత సీరియస్ గా తీసుకోలేదని, ఈ సమావేశానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వలేదని అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఆ రాష్ట్ర సమస్యలను అయన చెప్పుకున్నారు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సమావేశానికి హాజరు కాలేదు. అఫ్కోర్స్, తమిళ నాడు, కేరళ ముఖ్యమంత్రులు కూడా సమావేశానికి హాజరు కాలేదు. కానీ,  ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాకపోవడానికి, తెలంగాణ ముఖ్యమంత్రి హాజరు కాకపోవాడాన్ని ఒకే గాటన కట్టలేమని, అధికారులు అంటున్నారు. విభజన హామీల అమలు, కేంద్రం జోక్యంతో పరిష్కారం కావలసిన సమస్యలు ఎన్నో ఉన్న నేపధ్యంలో ముఖ్యమంత్రి జోనల్ సమావేశానికి హాజరు కాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని, అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా హుజూరాబాద్ ఓటమి తర్వాత, ఇటు కేంద్రం పైనా అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైన యుద్ధాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు సంకేతంగా తమ ధిక్కారాన్ని తెలియచేసేందుకే, సమావేసానికి హాజరుకాలేదా?థర్డ్ ఫ్రంట్ వైపు వెళుతున్నానన్న సంకేతాలు ఇచ్చేందుకు తిరుపతి సమావేశానికి హోమ్ మంత్రి ముహ్మద్ అలీని పంపి తాను దూరంగా ఉన్నారా? అనే చర్చ రాజకీయ, అధికార వర్గాల్లో చురుగ్గా సాగుతోంది.అలాగే హుజూరాబాద్ ఓటమి తర్వాత వరసగా రెండు రోజులు ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని, అటు బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోయడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేసిన నేపధ్యంలో,జోనల్ సమావేశానికి హాజరై, అడగ వలసిన ప్రశ్నలు అడగలేని పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా, ‘తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ’ రూటులో సమావేశానికి డుమ్మాకొట్టారా, అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అదే సమయంలో, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య విభజన హామీల అమలు, సమస్యల పరిష్కారానికి మరో రెండేళ్లలో పదేళ్ళ గడువు ముగుస్తున్న నేపధ్యంలో హామీల అమలు, సమస్యల పరిష్కారం కాకుండా అడ్డుకునేందుకు,తద్వారా సెంటిమెంట్ మంటల్లో రాజకీయ చలికాచుకునే ఉద్దేశంతో, కేసీఆర్, కీలక భేటీకి దూరంగా ఉన్నారా? అనే చర్చ కూడా సాగుతోంది. అయితే, రాజకీయ ప్రయోజనాలను ఆశించి, కేంద్ర రాష్ట్ర సంబధాలను రాజకీయం చేయడం వలన రాష్ట్రానికే నష్టమని, ముఖ్యంగా ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇలా కేంద్రంలో కయ్యానికి కాలు దువ్వడం వలన నష్టపోయేది రాష్ట్రమే కానీ, కేంద్రం కాదని సీనియర్ అధికారులు అంటున్నారు. చెరువు మీద అలిగితే .. చెరువుకు వచ్చే నష్టం ఉండదు, అలాగే అత్తమీద కోపం దుత్త మీద చూపినా అంతే అంటున్నారు.

Related Posts