విజయవాడ, నవంబర్ 16,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టి ఇప్పుడేం మాట్లాడతారని వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. హత్య ఘటన మొత్తం జగన్మోహన్ రెడ్డికి తెలుసని అందుకే గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేశారని అంటున్నారు. అసలు సూత్రధారుల్ని.. గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేసిన వారిని విచారిస్తే మొత్తం బయట పడుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ నేతలు ఇంతగా ఆరోపణలు చేస్తున్నా జగన్ పార్టీ నేతలు మాత్రం స్పందించడం లేదు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్ మెంట్ పైనా మట్లాడటం లేదు. టీడీపీ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడం లేదు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్ మెంట్ పై వైసీపీ నేతలు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు డ్రైవర్ దస్తగిరి. అందులో బడా నేతల పేర్లు ప్రస్తావించారు. కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో సీఎం జగన్ సన్నిహితుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఇందులో పెద్దల పాత్ర ఉందని కూడా చెప్పారు. దీంతో దస్తగిరి చెబుతున్న ఆ పెద్దలు ఎవరన్నది చర్చగా మారింది.
2019 మార్చిలో ఆయన నివాసంలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. వివేకా హత్య జరిగినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నా.. అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ కేసుపై దర్యాప్తు జరగకుండా అధికారులను బదిలీచేయడంలో.. మీడియాలో ప్రచారం జరగకుండా హైకోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకోవడంలో వైసీపీ సక్సెస్ అయింది. అదే సమయంలో చంద్రబాబే.. టీడీపీ నేతలతో కలిసి హత్యలు చేయించారన్న ప్రచారాన్ని మాత్రం ఉద్ధృతంగా చేశారు. నారాసుర రక్త చరిత్ర అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే వివేకా హత్య కేసులో తాజాగా వెలుగు చూస్తున్న పరిణామాలతో టీడీపీ నేతలు వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ వివేకాను సొంత కుటుంబసభ్యులే చంపినప్పటికీ సానుభూతి కోసం .. చంద్రబాబుపై బురద చల్లారని ఇప్పుడు నిజాలు బయటకు వచ్చాయని అంటున్నారు. దీనిపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్యకేసు అంశంలో ప్రస్తుతానికి దస్తగిరి కన్ఫెషన్ మాత్రమే బయటకు వచ్చింది. ఇంకా బయటకురావాల్సినవి చాలా ఉన్నాయంటున్నారు. సాక్ష్యాలు తుడిచేసిన వారిని.. మర్డర్ కేసును గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేసిన వారిని సీబీఐ ప్రశ్నిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయంటున్నారు. ఆ రోజున గుండెపోటు అని .. వైఎస్ వివేకా మరణవార్తను అధికారికంగా మీడియాకు చెప్పింది విజయసాయిరెడ్డినే. అందుకే సీబీఐ సీరియస్‌గా విచారణ జరిపితే సంచలనాలు బయటకు వస్తాయని అంచనా వేస్తున్నారు టీడీపీ నేతలు. మొత్తంగా వివేకా హత్య కేసులో కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగూల్మంపై వైసీపీ నేతలు స్పందించకపోవడంపై జనాల్లోనూ చర్చ సాగుతోంది. హత్య వెనుక ఉన్న అసలు పెద్దలెవరో తేలాల్సిన అవసరం ఉందనే వాదన వస్తోంది