శివుడు నిత్యశుభకరుడు.
సర్వమంగళాకారుడు. శివుడే శుభం, శుభమే శివుడు. శివుడే జయం, జయమే శివుడు. శివ అను శబ్దములో శ అనగా నిత్యమైన సుఖము సాధకుడగు పురుషుడు. వ అనగా అమృతశక్తి అని అర్థం. అనగా పురుషునకు నిత్యమైన ఆనందమును ప్రసాదించు అమృత శక్తి అని అర్థము.
శివుని దృష్టిలో బ్రహ్మాది దేవతలు పశుపక్ష్యాదులు ప్రాణకోటి మొత్తం పశువులే. జీవకోటికి మోక్షమును ప్రసాదించు శివుడు పశుపతి. తత్వత్రయమనగా పశువు, పాశము, పతి అన మూడు తత్వములు. అవి జడము, అజడము, జడాజడములు అను వానిని నియంత్రించును. పశువు జీవుడని, పాశము ప్రకృతియని పశు పాశములను శాసించువాడు పశుపతి అని అర్థం.
ఈశ్వర సంబంధమైన పరతత్వము ఆది, మద్యము అంతం లేనిది. సకల లోకములకు ఆధారమైనది. సమస్త విద్యలలో వేదాలు శ్రేష్టమైనవి. వేదాలలో నమక చమకాదులతో కూడిన రుద్రాధ్యాయం శ్రేష్ఠం.
నమకంలో శివపంచాక్షరి మంత్రం ఓం నమఃశివాయ శ్రేష్ఠం. ఆ పంచాక్షరిలో శివశబ్దం శ్రేష్టం. మానవ పరంగా వారి స్థూల సూక్ష్మ కారణ శరీరాలను నశింపజేసి జ్ఞానాన్ని కలిగించేవాడు. ఆయనకు సూర్యచంద్రులు రెండు నేత్రములు. ఫాలభాగంలో మూడో నేత్రం అగ్నినేత్రం. విభూతి ధరించని ఫాలభాగం, శివాలయం లేని గ్రామం ఈశ్వరుని ధ్యానించని మానవ జన్మం, శివ సంబంధమైన పరబ్రహ్మమును తెలుపని విద్య వ్యర్థము. మనస్సు వాక్కు హస్తములు చెవులు కనులు బుద్ధి ఈ ఆరింటిని సదాశివుడి యందు నిల్పువారు ధన్యులు. శివమోక్షప్రాప్తికి అర్హులు.
‘శివ’ అనే రెండు అక్షరాలతో చెప్పబడిన పరతత్వం సృష్టికి ఆధారం. శుభప్రదమైన సుఖప్రదమైన సృష్టిని సృష్టించేది, జగత్తును సర్వదా రక్షించేది, సృష్టిని నడిపించేది శివా అను శబ్దము. శివ అంటే మంగళకరమైనదే కాదు శుభప్రదమైనది. రుద్ర అంటే రోదనం పోగొట్టువాడు. అందువలన భోళాశంకరుడు మంగళకరమైనవాడని ప్రాచుర్యం పందాడు. శివసానిధ్యం కోరుకునేవారికి శివనామస్మరణ సులభమార్గం.
శివా అని పిలిస్తే ఆ కైలాస వాసుడు కమనీయశోభుడు పార్వతీ ప్రియుడు పరుగెట్టుక వస్తాడు. కష్టాలను దూరం చేస్తాడు. అసురులకే అడిగిన వరాలనిచ్చిన పశుపతి సాత్విక గుణాలతో పూజిస్తే ఇవ్వని వరం ఏదైనా ఉంటుందా?
ఉండదు కాక ఉండదు.
పశుపతి తత్వాన్ని అర్థం చేసుకొని ఈ మానవ జన్మ అనే పశుజన్మను వీడి పశుపతి సానిధ్యాన్ని పొందడానికి నిరంతరమూ కృషిచేయాలి.