ఒంగోలు
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం 700వ రోజుకు చేరింది. మరోవైపు రాజధాని కోసం అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర 16వ రోజుకు చేరింది. దీంతో మహాపాదయాత్రలో భాగంగా మంగళవారం రైతులు పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. 16వ రోజుకు చేరిన మహాపాదయాత్ర.. ప్రకాశం జిల్లాలోని విక్కిరాలపేట నుంచి కందుకూరు వరకు సాగింది. ఉదయం అమరావతి రైతుల సర్వమత ప్రార్థనలు, అమరావతి అమరవీరులకు నివాళులు, రైతుల ప్రత్యేక నిరసన కార్యక్రమం, అమరావతి లక్ష్యసాధన ప్రతిజ్ఞ, దళిత మైనారిటీల అమరావతి సంకల్పం, మహిళల ప్రత్యేక మాలధారణ, అమరావతి ఉద్యమ గీతాల ఆలాపన, ఉద్యమ కాలాల్లో ముఖ్యమైన ఘట్టాలపై వ్యాఖ్యానం, పాదయాత్ర మార్గమధ్యలో కళ్లకు గంతలతో నిరసన, అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు.