ముంబై, నవంబర్ 16,
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 ముగిసింది. ప్రపంచానికి ఆస్ట్రేలియా రూపంలో కొత్త టీ20 ప్రపంచ ఛాంపియన్ లభించింది. ఈ ప్రపంచకప్‌లో భారత్ ప్రదర్శన మాత్రం చాలా నిరాశపరిచింది. సూపర్-12 దశను కూడా దాటలేకపోయింది. అయితే ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు దుబాయ్ ప్రదర్శనను మరిచిపోయి.. శుభారంభం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీ20లో జట్టుకు కొత్త కెప్టెన్, కోచ్‌లు జతకావడంతో ఈ పోరు చాలా ఆసక్తికరంగా మారింది.టీ20 ఫార్మాట్‌లో భారత జట్టుకు కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. అలాగే రాహుల్ ద్రవిడ్ జట్టుకు కొత్త కోచ్‌గా నియమితులయ్యారు. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో ఇద్దరూ జట్టు బాధ్యతలు చేపట్టనున్నారు. జట్టును కొత్త కోణంలోకి తీసుకెళ్లాలని వీరిద్దరూ కోరుకుంటున్నారు. న్యూజిలాండ్ టీం భారత్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో భారత జట్టుకు సరికొత్త ఆరంభానికి ఇదో గొప్ప అవకాశం కానుంది.టీ20 ప్రపంచకప్-2021లో ఫైనల్‌కు చేరిన జట్టుగా న్యూజిలాండ్ సరికొత్త చరిత్ర నెలకొల్పింది. టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరడం కివీస్‌కు ఇదే తొలిసారి. కానీ, టైటిల్ మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్‌కు కూడా ఫైనల్ పోరును మరిచిపోయి మరోసారి ఘనమైన ఆరంభాన్ని ఇచ్చేందుకు ఆరాటపడుతోంది.ఈ పర్యటనలో రెండు జట్లు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనున్నాయి. తొలి టీ20 మ్యాచ్ జైపూర్‌లో జరగనుండగా, దాని కోసం భారత జట్టు అక్కడికి చేరుకుంది. సిరీస్‌లోని రెండు టీ20 మ్యాచ్‌ల కోసం ప్రేక్షకులను కూడా స్టేడియంలోకి అనుమతించారు. ఈ పర్యటన షెడ్యూల్, మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయి, పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్..
మొదటి మ్యాచ్ – బుధవారం, నవంబర్ 17న భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్, సమయం – రాత్రి 7గంటలకు.
రెండవ మ్యాచ్ – శుక్రవారం, నవంబర్ 19న, భారత్ వర్సెస్ న్యూజిలాండ్, JSCA ఇంటర్నేషనల్ స్టేడియం రాంచీ, రాత్రి 7 గంటలకు.
మూడవ మ్యాచ్ – నవంబర్ 21 ఆదివారం, భారత్ వర్సెస్ న్యూజిలాండ్, ఈడెన్ గార్డెన్స్ స్టేడియం, కోల్‌కతా, రాత్రి 7 గంటలకు.
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్
తొలి టెస్ట్ మ్యాచ్, నవంబర్ 25 నుంచి 29 వరకు, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, గ్రీన్ పార్క్ కాన్పూర్, ఉదయం 9:30 గంటలకు
రెండవ మ్యాచ్, డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 7 వరకు, భారత్ వర్సెస్ న్యూజిలాండ్, వాంఖడే స్టేడియం, ముంబై ఉదయం 9:30 గంటలకు మొదలుకానుంది.
ప్రత్యక్ష ప్రసారం..
ఇండియా vs న్యూజిలాండ్ 2021 టీ20 సిరీస్‌ను స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 HD, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ HD, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళ్, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ డిజిటల్ విభాగం అయిన డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ అందుబాటులో ఉంటుంది.