లక్నో, నవంబర్ 16,
త్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్‌పూర్ జిల్లా కర్వాల్ ఖేరీ వద్ద ప్రధాని నరేంద్రమోదీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. ప్రధాని మోదీ సీ-130 హెర్క్యులస్ విమానంలో ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. పూర్వంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై నిర్మించిన ఎయిర్ స్ట్రిప్‌పై ఆ సీ-130 విమానం ల్యాండయ్యింది. ఈ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా పాల్గొన్నారు.ఈ ఎక్స్‌ప్రెస్ వేను మొత్తం 341 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే లక్నో జిల్లాలో లక్నో-సుల్తాన్‌పూర్ జాతీయ రహదారిపైగల చౌద్‌సరాయ్ గ్రామం వద్ద ప్రారంభమై.. ఉత్తరప్రదేశ్-బీహార్ సరిహద్దుకు తూర్పున 18 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి 31 మీదగల హైదరియా గ్రామం వద్ద ముగుస్తుంది. అత్యవసర సమయాల్లో ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్‌లు ల్యాండ్ అవడానికి, టేకాఫ్ అవడానికి వీలుగా ఈ ఎక్స్‌ప్రెస్ వేపై నిర్మించిన 3.2 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నది.ప్రస్తుతం ఆరు లేన్‌లలో నిర్మితమైన ఈ ఎక్స్‌ప్రెస్ వేను భవిష్యత్తులో ఎనిమిది లేన్‌లకు మార్చనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి అంచనా వ్యయం రూ.22,500 కోట్లు. ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాలు ప్రత్యేకించి లక్నో, బారాబంకీ, అమేథీ, అయోధ్య, సుల్తాన్‌పూర్, అంబేద్కర్ నగర్, అజాంగఢ్, మవూ, ఘాజీపూర్ జిల్లాల ఆర్థిక ప్రగతికి మరింత ఊతం ఇవ్వడం కోసం ఈ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించారు. ఎక్స్‌ప్రెస్‌వేపై 3.2 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ కూడా తయారు చేయబడింది. ఎయిర్‌స్ట్రిప్ వద్ద గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానికి స్వాగతం పలికారు.