న్యూఢిల్లీ, నవంబర్ 16,
పెట్రో ధరలు మోయరాని భారంగా అనిపిస్తే.. మీరు ఓటు వేసి ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు సలహా ఇచ్చారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించి ప్రజలకు ఊరట కలిగించాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రప్రభుత్వాలను కోరినట్లు గుర్తుచేశారు. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం దీనికి సముఖంగా లేవన్నారు. ఆ రాష్ట్రాలను ఓటు వేసి గెలిపించుకున్న ప్రజలే ప్రశ్నించాలని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం విజ్ఞప్తి మాత్రమే చేయగలదని.. ఇప్పటికే తాము పన్నులు తగ్గించి పెట్రో ధరలను నియంత్రించాలని రాష్ట్రాలని కోరినట్లు తెలిపారు.దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5లు, డీజిల్‌పై రూ.10లు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం తెలిసిందే. అన్ని రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు, మరికొన్ని ఇతర రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాయి. అయితే కొన్ని ప్రభుత్వాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వ సూచనలు తోసిపుచ్చాయి. గతంలో పెట్రోల్, డీజిల్‌పై భారీగా ఎక్సైజ్ డ్యూటీని పెంచిన కేంద్రం.. ఇప్పుడు చాలా తక్కువగా మాత్రమే దీన్ని తగ్గించిందని ఆ రాష్ట్రాలు వాదిస్తున్నాయి. తాము వ్యాట్‌ను పెంచలేదని.. అందుకే ఇప్పుడు దీన్ని తగ్గించాల్సిన అవసరం లేదంటున్నాయి.పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోబోదని నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు.