తమిళనాడులో లాగా మన రాష్ట్రంలో సుబ్రహ్మణ్య దేవాలయాలు
ఎక్కువ సంఖ్యలో లేవుగానీ సుబ్రహ్మణ్య ఆరాధన మాత్రం దాదాపు ప్రతి హిందువూ చేస్తాడు. ప్రతి ఆలయంలోనూ భక్తుల పూజలందుకునే నాగ ప్రతిమలే ఇందుకు తార్కాణం. చిన్న పిల్లలకు చెవికి సంబంధించిన బాధలు వస్తే వెంటనే సుబ్రహ్మణ్యస్వామికి మొక్కుకునే తల్లులెందరో. కంటి, చెవి, చర్మ వ్యాధులను నయం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించే వరదుడు
సుబ్రహ్మణ్యుడని భక్తుల నమ్మకం. శావణ మాసంలో నాగ పంచమి, కిందటి నెలలో - నాగుల చవితి, ఈ నెలలో సుబ్రహ్మణ్య షష్టి. ఇవి సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పర్వదినాలు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలోని మోపిదేవి గ్రామంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయ దర్శనం చేసుకుందాం. స్కాంద పురాణంలో ఈ క్షేత్ర ప్రశంస కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యస్వామిని గుర్తించింది. అగస్త్య మహర్షి. అగస్త్యుడు ప్రజల శ్రేయస్సు కోసమై కాశీలో సదాశివుని సన్నిధి విడిచి దక్షిణాపధానికి వచ్చాడు. ఆ కధ ఏమటంటే..
పూర్వం వింధ్య పర్వతం అహంకారంతో తానే ఎత్తుగా ఉండాలని ఆకాశంవైపు పెరగసాగింది. దానితో సూర్య చంద్రులు, మిగతా గ్రహ గతులకి ఆటంకం ఏర్పడి లోకమంతా అంధకారమయమయింది. దేవతలు, మహరులు ఆందోళన చెంది కాశీలో విశ్వేశ్వరుని సేవించుకుంటూ ఉన్న అగస్త్య మహర్షి దగ్గరకు వెళ్ళి వింధ్య పర్వతం గర్వమణచి ప్రపంచాన్ని కాపాడాలని ప్రార్ధించారు. అగస్త్య మహర్షికి తాను దక్షిణా పధానికి వెళ్లే కల్పాంతమైనా తాను తిరిగి కాశీ రాలేనని తెలుసు. కానీ ప్రజా శ్రేయస్సుకోసం కాశీ పట్టణాన్ని విడిచి భార్య లోపాముద్రతో, కొంత శిష్యగణంతోనూ దక్షిణాపధానికి బయల్దేరాడు.
దారిలో వింధ్య పర్వతం అగస్త్య మహర్షి రాకను చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు. అగస్త్యుడు తాను తిరిగి వచ్చేవరకు వింధ్య పర్వతాన్ని అలాగే ఉండమన్నాడు. ఆ విధంగా లోక సంక్షోభాన్ని నివారించి, తాను భార్యా, శిష్య సమేతంగా సంచరిస్తూ కృష్ణానదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ కనక దుర్గాదేవిని, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకుని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నాడు. అప్పుడు అప్రయత్నంగా మహర్షి నోటినుండి “వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమార క్షేత్రముత్తమమ్ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్” అని వచ్చింది. ఆ ప్రాంతమంతా అనేక పుట్టలతో నిండి ఉంది. మహర్షి ఆ ప్రాంతంలో వెతికి ఒక పుట్టనుండి దివ్య తేజస్సు రావడం గమనించి దానినే కుమారస్వామి నెలవుగా గ్రహించాడు. మాండవ్యుడనే శిష్యుని అనుమాన నివృత్తి చేస్తూ కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒకరేనని వివరిస్తూ, ఆయన అక్కడికి వచ్చి తపస్సు చేయడానికి కారణం ఈ విధంగా వివరించాడు. పూర్వం సనక, సనత్కుమారాది మహరులుండేవారు. వారు గొప్ప భక్తులు. ఎల్లప్పుడూ వారు దైవ నామస్మరణతో గడిపేవారు.
ఎప్పుడూ ఐదు సంవత్సరాల బాలులలాగా ఉండేవారు. పైగా దిగంబరులు. వారు ఒకసారి శివ దర్శనానికి కైలాసం వెళ్ళారు. ఆ సమయంలో శివుడు కైలాసంలో లేడు. పార్వతీ దేవి, కుమారస్వామి, ఇంకా అనేకమంది దేవతలు అక్కడ సభ తీరివున్నారు. ఒకవైపు అత్యుత్తమ వేషభూషణాలతో విలసిల్లుతున్న దేవతలు, ఇంకొకపక్క జటాధారులైన శివ గణాలు, మహర్షులు, ఆ వ్యత్యాసం చూసి కుమారస్వామికి నవ్వు వచ్చి నవ్వాడు.
అది గమనించి పార్వతీ దేవి తనయుడి నవ్వుకి కారణం అడిగింది. కుమారునికి అక్కడివారు తన తండ్రివలె, తల్లివలె కనిపించలేదా అని ప్రశ్నించింది. తల్లి ప్రశ్నతో తన ఆలోచనలకు సిగ్గుపడ్డ కుమారస్వామి తల్లి పాదాలపై పడి క్షమాపణ అడిగి, అవసరం లేదని తల్లి వారించినా వినక తన పాపానికి ప్రాయశ్చిత్తంగా తపస్సు చెయ్యడానికి వెళ్ళాడు. ఈ ప్రాంతంలో తన తపస్సు భగ్నం చేసేవారుండరని తలచి, ఎవరికంటా పడకుండా ఒక పుట్ట నిర్మించుకుని అందులో సర్పరూపంలో తపస్సుచేయసాగాడు.
అగస్త్య మహర్షి చూసింది ఆ పుట్టనే. ఆయన కుమారస్వామి తపస్సుకి భంగం కలగకుండా, పుట్టమీద పాముపడగతో ఉన్న ఒక శివ లింగాన్ని ప్రతిష్టించి, రోజూ పత్నీ, శిష్య సమేతంగా దానికి పూజలు చేయసాగాడు. కొంతకాలం అక్కడ గడిపిన తర్వాత మహర్షి తన పరివారంతో ఆ ప్రదేశాన్ని వీడి వెళ్ళిపోయాడు. తరువాత కొందరు మునులు అక్కడ శివ లింగానికి పూజలు చేశారు. కానీ కాలాంతరమున ఆ లింగానికి పూజలు చేసేవాళ్ళు లేక దానిపైన కూడా పుట్టలు వచ్చాయి.
కలియుగంలో ఆ ప్రాంతంలో కుమ్మరులు నివాసమేర్పరచుకున్నారు. అందులో వీరారపు పర్వతాలు ఒకరు. ఆయన దైవ భక్తుడు. ఒకనాడు ఆయన కలలో సుబ్రహ్మణ్యస్వామి కనబడి తాను ఉన్న పుట్టగురించి చెప్పి, తనని వెలికి తీసి గుడి కట్టించి, పూజలు చేయమని చెప్పాడు. పర్వతాలు తనవారందరికీ ఆ విషయం చెప్పి, అందరినీ తీసుకుని, స్వామి పుట్ట తవ్వి, స్వామిని బయటకి తీశారు. వారంతా కలసి చిన్న గుడి కట్టించి స్వామిని పూజించసాగారు. పర్వతాలు మట్టితో రకరకాల బొమ్మలు చేసి, వాటిని కాల్చి బాగా మన్నేటట్లు తయారుచేసి స్వామికి సమర్పించసాగాడు. అవి కాలగర్భంలో కలిసిపోయినవి పోగా, ప్రస్తుతం ఉన్నవి నంది, గుఱ్ఱం. వీటిని కళ్యాణ మండపంలో ఇప్పటికీ చూడవచ్చు. ఆ ఆలయ విశేషాలు ఆలయ ప్రవేశ ద్వార గోపురం తూర్పు ముఖంగా ఉంటుంది. లోపలకి ప్రవేశించగానే ఎదురుగా ప్రధాన
ఆలయం దర్శనమిస్తుంది. మహామండపం స్తంభాలపై వివిధ దేవతా మూర్తులు, నెమళ్ళు దర్శనమిస్తాయి. ఇక్కడే ధ్వజస్తంభముంటుంది. ఇది దాటి అంతరాలయంలోకి వెళ్ళగానే గర్భగుడిలో పాముచుట్టుకుని ఉన్నట్లున్న పీఠంపై సుబ్రహ్మణ్యేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఈ పీఠానికి కింద ఒక రంధ్రం కనిపిస్తుంది. పక్కనే మండపంలో ఉన్న పెద్ద పుట్టలో దివ్య సర్పం ఉంటుందని, అది ఆ రంధ్రంగుండావచ్చి స్వామిని సేవిస్తుందనీ చెప్తారు. స్వామికి ఇరువైపులా ఉన్న మండపాలలో వల్లీ దేవసేనలు భక్తుల పూజలందుకుంటూ దర్శనమిస్తారు. ఆలయం పక్కనేవున్న పుట్ట, నాగ ప్రతిమలకు భక్తులు పాలు పోస్తుంటారు. ఆలయంలోనే భక్తుల సౌకర్యార్థం పాలు అమ్ముతారు.
పూర్వం ఈ ఊరి పేరు మోహినీపురం. అది క్రమేణా మోపిదేవి అయింది. ప్రస్తుతం ఉన్న ఆలయం 300 సంవత్సరాల క్రితం దేవరకొండ పాలకులు నిర్మింపచేశారు. తర్వాత చల్లపల్లి జమీందారులు ఈ ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఈ ఇక్కడ భక్తులు చిన్నపిల్లలకు చెవులు కుట్టించడం, తల నీలాలు సమర్పించడం, అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు చేయిస్తారు. నాగ దోషం ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయిస్తారు. అలాగే వివాహం జరగడం ఆలస్యమయినా ఇక్కడ మొక్కుకుంటే త్వరగా అవుతుందంటారు. ఉత్సవాలు
నాగుల చవితి, సుబ్రహ్మణ్యషష్టివంటి పర్వదినాలలోనేగాక, గురువారం, ఆదివారం, ఇంకా ఇతర సెలవు రోజులలో భక్తుల రాక అధికంగా ఉంటుంది. పర్వదినాలలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరుగుతాయి. ప్రతి రోజూ శాంతి కళ్యాణం జరుగుతుంది. ప్రతి నెలా కృత్తిక నక్షత్రం రోజు రాహు, కేతు, సర్పదోష నివారణ కోసం ప్రత్యేక పూజలు జరుగుతాయి. సకలేశ్వరస్వామి ఆలయం
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం పక్కనే సకలేశ్వరస్వామి ఆల యం ఉంటుంది. ఈయన స్వయంభువు. సగర మహారాజు పూజించిన లింగం కావడంతో ఆ పేరు వచ్చింది. మోపిదేవి 1783లో వరదలలో కొట్టుకుపోయినప్పుడు ఈ లింగం బయటపడింది. అప్పటి జమీందారు అడుసుమిల్లి గంగభోట్లు ఆలయం నిర్మిపచేశారు. అయితే ఈ లింగం భూమిలో చాలా లోతువరకు ఉందని కొందరి ఆభిప్రాయం. ఈ ఆలయ నిర్వహణ అడుసుమిల్లివారి కుటుంబ సభ్యులదే. దీని పక్కనే సరస్వతీ దేవి ఆలయం కూడా ఉంది.
|
|