కాకినాడ, నవంబర్ 17,
తెలుగు చలనచిత్ర రంగంలో ‘సహజనటి’గా పేరుగాంచిన డాక్టర్ సూర్యకాంతం పేరున తపాలాశాఖ ప్రత్యేక కవరు విడుదల చేయనుంది. ఈ నెల 18న దీనిని ఆవిష్కరించనున్నట్టు కాకినాడ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ డీఎస్‌యూ నాగేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈమె కాకినాడకు చెందిన వారు. తెలుగు వెండితెరపై గయ్యాళి అత్తయ్యగా పేరుపొందిన ఈ నటీమణి పేరున కాకినాడ ఎన్‌ఎఫ్‌సీఎల్ రోడ్డులోని సత్కళావాహినిలో ‘ప్రత్యేక తపాలా చంద్రిక ఆవిష్కరణ’ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి, మేయర్ సుంకర శివప్రసన్న, విశాఖ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ ఎం. వెంకటేశ్వర్లు హాజరవనున్నారు. 1924 అక్టోబరు 28న కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో జన్మించిన సూర్యకాంతం చిన్నప్పటి నుంచే అల్లరి అమ్మాయిగా ముద్ర పడిపోయారు. కాకినాడ యంగ్‌మెన్స్ హ్యాపీ క్లబ్‌లో నాటకాలు వెయ్యడం ద్వారా అంజలి, ఆదినారాయణరావు, ఎస్వీ రంగారావు లాంటి ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. అదే ఆమెకు వెండితెరపై ఆసక్తిని పెంచింది. తొలి రోజుల్లో చిన్న చిన్న గుర్తింపు లేని పాత్రలకే సూర్యకాంతం పరిమితమయ్యారు.వరద గోదావరిలా సంభాషణలు వల్లించగల సామర్థ్యం ఉన్న ఆమె ‘ధర్మాంగత’ చిత్రంలో మూగపాత్ర ధరిచారు. అయితే హీరోయిన్‌గా నటించినా మాటలు లేకపోవడంతో ఓ మంచి అవకాశం అలా జారిపోయింది. 1950లో ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ హీరోలుగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సంసారం సినిమా సూర్యకాంతం కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. ఆ చిత్రం కయ్యాలమారిగా..గయ్యాళి గంపగా నిలబెట్టింది. అక్కడి నుంచి ఒకటా, రెండో ఎన్నో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఆమె కోసమే పాత్రల్ని.. సంభాషణలు చిత్రీకరించేవారంటే అతిశయోక్తి కాదు.ప్రముఖ నటులిద్దరు హీరోలుగా నటించిన సినిమాలో ఆమె పాత్ర పేరుతోనే ‘గుండమ్మ కథ’ తీశారంటే సూర్యకాంతం స్థాయి అర్థం చేసుకోవచ్చు. తాను తింటూ నలుగురికి పెట్టడం ఆమె గొప్ప లక్షణాలని సూర్యకాంతం గురించి తెలిసిన వారు చెబుతుండేవారు. సినిమాలో ‘అత్తరికాన్ని’ చెలాయించి ప్రేక్షకుల గుండెలపై చెరగని ముద్ర వేసుకున్న ఈ మహానటి 1994 డిసెంబరు 18న కన్నుమూశారు. ఎన్ని తరాలు మారినా తెలుగుతనం ఉన్నంతవరకూ గుర్తుండిపోయే అతి తక్కువ సహజ నటుల్లో సూర్యకాంతం ఒకరు. ఇంతటి మహానటి మన జిల్లాకు చెందిన వారు కావడం గర్వకారణం.